ఇండియాలో టాలీవుడ్ అనే కాదు.. అన్ని సినీ పరిశ్రమలూ హీరోల చుట్టూనే తిరుగుతాయి. సినిమాలో హీరోల పాత్రలకే అధిక ప్రాధాన్యం ఉంటుంది. ప్రమోషన్లలో సైతం వారికే ప్రయారిటీ ఇస్తారు. ఏవో కొన్ని సినిమాల్లో మాత్రమే హీరోయిన్లు హైలైట్ అవుతుంటారు. ప్రమోషన్లలోనూ వారికి తగిన ప్రాధాన్యం లభిస్తుంటుంది. ఐతే విరాటపర్వం సినిమాలో హీరోకు దీటుగా, ఇంకా చెప్పాలంటే హీరోను మించి హీరోయిన్ పాత్ర ఉంటుందేమో అన్న అభిప్రాయాలు కలుగుతున్నాయి.
సినిమా సంగతేమో కానీ.. ప్రమోషన్లలో ఆమెకిస్తున్న ప్రాధాన్యం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రోమోల్లో రానాను మించి సాయిపల్లవి హైలైట్ అవుతోంది. ఆమె ఫస్ట్ లుక్ ప్రత్యేకంగా రిలీజ్ చేశారు. అలాగే ఏ ప్రోమో వదిలినా సాయిపల్లవి హైలైట్ అవుతోంది. అంతే కాక పోస్టర్ మీద ఆమె పేరుకు ఇస్తున్న ప్రాధాన్యం చర్చనీయాంశం అవుతోంది.
విరాటపర్వంకు సంబంధించి ఏ పోస్టర్ వదిలినా ముందు సాయిపల్లవి పేరు వేసి, తర్వాత రానా పేరు ఉండేలా చూస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన కోలు కోలు పాట పోస్టర్లోనూ అదే చేశారు. ఈ గౌరవం అందరు హీరోయిన్లకూ దక్కదు. అంటే ఈ సినిమాలో రానా కంటే సాయిపల్లవి పాత్రే కీలకం అన్నమాట. సినిమాలో అలా ఉన్నప్పటికీ మన ఇండస్ట్రీ సంప్రదాయం ప్రకారం చూస్తే హీరో పేరే ముందుంటుంది.
రానా కూడా చిన్న హీరో ఏమీ కాదు. బాహుబలితో అంతర్జాతీయ గుర్తింపు సంపాదించాడు. హీరోగా అతడికంటూ మార్కెట్ కూడా ఉంది. ఇలాంటి హీరో తన పేరు వెనుక ఉండటానికి ఒప్పుకోవడం విశేషమే. ఈ సినిమాను నిర్మిస్తున్నది కూడా రానా తండ్రి సురేష్ బాబే. ఆయన కూడా కొడుకు పేరు పోస్టర్లో ఇలా పడేలా ఒప్పుకోవడం గొప్ప విషయమే. నటిగా సాయిపల్లవి స్థాయి ఏంటో అందరికీ తెలిసిందే కాబట్టి బలమైన, ఇంటెన్స్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సినిమా ఆమె కెరీర్లో మరో మైలురాయి అవుతుందని భావిస్తున్నారు.