నెట్ ఫ్లిక్స్ రేంజేంటి.. ఇలాంటి ఎంట్రీ ఏంటి?

ప్ర‌పంచ‌వ్యాప్తంగా నెట్ ఫ్లిక్స్ రూపొందించే కంటెంట్ మీద రోజుకు పెట్టే స‌గ‌టు ఖ‌ర్చు రూ.200 కోట్ల‌ట‌. టాలీవుడ్ ద‌ర్శ‌కుడు దేవా క‌ట్టా ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించిన విష‌య‌మిది. దీన్ని బ‌ట్టి ఆ సంస్థ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. ప‌దుల కోట్లు పెట్టి తీసిన సిరీస్‌లు, సినిమాల‌ను కూడా క్వాలిటీ లేకుంటే నిర్దాక్షిణ్యంగా ప‌క్క‌న పెట్టేస్తుంద‌ని, క్వాలిటీ విష‌యంలో అస‌లు రాజీ ప‌డ‌ద‌ని నెట్ ఫ్లిక్స్ గురించి చెబుతుంటారు. అలాంటి సంస్థ చాలా ఆల‌స్యంగా తెలుగులోకి అడుగు పెట్టింది పిట్ట‌క‌థ‌లు యాంథాల‌జీ ఫిలింతో.

ఈ సంస్థ ఇండియాలో నాలుగైదేళ్ల నుంచి ఇండియ‌న్ మార్కెట్ మీద దృష్టిపెట్టి వివిధ భాష‌ల్లో ఒరిజిన‌ల్ కంటెంట్ రూపొందిస్తోంది. హిందీతో పాటు త‌మిళంలోనూ నెట్ ఫ్లిక్స్ సిరీస్‌లు వ‌చ్చాయి. వాటి క్వాలిటీ చూసి నెట్ ఫ్లిక్స్ నెట్ ఫ్లిక్సే అంటూ ప్ర‌శంస‌లు కురిపించారు యూజ‌ర్లు. త‌మిళంలో చివ‌ర‌గా ఆ సంస్థ అందించిన పావ క‌థైగ‌ల్ చూస్తే నెట్ ఫ్లిక్స్ ప్ర‌మాణాలు అర్థ‌మ‌వుతాయి.

ఐతే తెలుగులోకి నెట్ ఫ్లిక్స్ రావ‌డానికి టైం ప‌ట్టింది కానీ.. ఆల‌స్య‌మైనా అదిరిపోయే కంటెంట్‌తో వ‌స్తార‌ని అనుకున్నారు మ‌న ప్రేక్ష‌కులు. కానీ పిట్ట‌క‌థ‌లు చూస్తే నెట్ ఫ్లిక్స్ ప్ర‌మాణాల‌కు త‌గ్గ‌ట్లు లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇందులో త‌రుణ్ భాస్క‌ర్ తీసిన రాములాకు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వ‌చ్చింది. అది అన్ని ర‌కాలుగా మెప్పించింది. ఈ ఫిలిం మీద అంచ‌నాలు పెంచింది. కానీ త‌ర్వాత వ‌చ్చే మూడు ఎపిసోడ్లకు క్వాలిటీ ప‌డిపోతూ వెళ్లింది. నందిని రెడ్డి తీసిన మీరా ప‌ర్వాలేదు. అంతే త‌ప్ప అది కూడా అనుకున్న స్థాయిలో లేదు.

నాగ్ అశ్విన్ రూపొందించిన ఎక్స్ లైఫ్ జ‌నాల‌కు ఎక్క‌లేదు. కాన్సెప్ట్ బాగున్నా అది అనాస‌క్తిక‌రంగా అనిపించింది. ఇక సంక‌ల్ప్ రెడ్డి తీసిన పింకీ అయితే ప్రేక్ష‌కుల‌ను చిరాకు పెట్టింది. ఓవ‌రాల్‌గా చూస్తే పిట్ట క‌థ‌లు ప్రేక్ష‌కుల అంచ‌నాలు అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. ఇంత టైం తీసుకుని ఇలాంటి కంటెంట్‌తో నెట్ ఫ్లిక్స్ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వ‌డ‌మేంటి అనే విమ‌ర్శ‌లు సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.