రవితేజ, నాని, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ లాంటి చాలామంది టాలీవుడ్ హీరోలు ముందు దర్శకత్వ విభాగంలో పని చేసిన వాళ్లే. సీరియస్‌గా దర్శకులు కావాలన్న లక్ష్యంతోనే వాళ్లా విభాగాల్లో పని చేశారు. కానీ అనుకోకుండా నటనలోకి వచ్చారు. టాలీవుడ్లోనే కాదు..కోలీవుడ్లో కూడా ఇలాంటి హీరోలు లేకపోలేదు. వారిలో తెలుగువాడైన విశాల్ ఒకడు.
విశాల్ అన్న విక్రమ్ హీరో కావాలనుకుంటే.. విశాలేమో దర్శకుడు కావాలన్న లక్ష్యంతో పరిశ్రమలోకి వచ్చాడు. కొంత కాలం అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసి అనుకోకుండా ఇతను హీరో అయిపోయాడు. విక్రమ్ నిర్మాణంలోకి వెళ్లిపోయాడు. తాను ఏదో ఒక రోజు దర్శకత్వం చేపడతానని చాలా ఏళ్ల నుంచి విశాల్ చెబుతూనే ఉన్నాడు. గత ఏడాది అనుకోకుండా అతను మెగా ఫోన్ పట్టేశాడు.
తన హిట్ మూవీ తుప్పరివాలన్ (తెలుగులో డిటెక్టివ్) సీక్వెల్ నుంచి ఉన్నట్లుండి దర్శకుడు మిస్కిన్ తప్పుకోవడంతో విశాల్ మిగతా సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తయ్యాక మరో చిత్రంతో తాను పూర్తి స్థాయి దర్శకుడిగా మారనున్నట్లు విశాల్ తాజాగా వెల్లడించాడు. విశాల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఇరుంబు తిరై (తెలుగులో అభిమన్యుడు) చిత్రానికి సీక్వెల్ రానుందని, దాన్ని తనే డైరెక్ట్ చేస్తానని విశాల్ వెల్లడించాడు. తన కొత్త చిత్రం చక్ర.. అభిమన్యుడుకు సీక్వెల్ అని చాలామంది అనుకుంటున్నారని, కానీ అది నిజం కాదని, ఇది పూర్తిగా వేరే కథతో తెరకెక్కిన చిత్రమని విశాల్ తెలిపాడు.
తన మిత్రుడు ఆర్యతో కలిసి చేస్తున్న ఎనిమీ చాలా బాగా వస్తోందన్న విశాల్.. త్వరలోనే శరవణన్ అనే లఘు చిత్ర దర్శకుడితోనూ ఓ సినిమా మొదలుపెట్టనున్నట్లు వెల్లడించాడు. చక్ర శుక్రవారమే తమిళ, తెలుగు భాషల్లో విడుదలవుతున్న సంగతి తెలిసిందే.