బాల నటుడిగా మహేష్ బాబు ఎన్నో సినిమాలు చేశాడు. చలాకీగా నటించాడు. డ్యాన్సులు, ఫైట్లలో ప్రతిభ చాటుకున్నాడు. కానీ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్ని సినిమాలు చేసినా.. హీరోగా అరంగేట్రం చేశాక మళ్లీ ప్రూవ్ చేసుకోవాల్సిందే. హీరోగా తొలి చిత్రం ‘రాజకుమారుడు’లో మహేష్ లుక్స్ ఆకట్టుకున్నాయి. స్క్రీన్ ప్రెజెన్స్ బాగుందన్నారు. డ్యాన్సులు, ఫైట్లు బాగానే చేశాడు. ఆ సినిమా కమర్షియల్‌గా మంచి విజయం సాధించింది. మహేష్ లాంచింగ్‌కు బాగానే ఉపయోగపడింది.
నటుడిగా మహేష్ ఇందులో ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. రెండో సినిమా ‘యువరాజు’లో వయసుకు మించిన పాత్రతో మహేష్ కొంచెం ఇబ్బంది పడ్డాడు. మూడో సినిమా ‘వంశీ’ అన్ని రకాలుగా మహేష్‌ను దెబ్బ కొట్టింది. కృష్ణ వారసుడి కెరీర్ ఒక డోలాయమాన స్థితికి చేరుకున్న దశ అది. అలాంటి సమయంలో వచ్చిందే ‘మురారి’ చిత్రం. విలక్షణ చిత్రాలకు పేరుపడ్డ కృష్ణవంశీ ఒక సాహసోపేత కథతో ఈ సినిమాను రూపొందించాడు. మహేష్ కెరీర్లో ఇదొక మైలురాయి అవుతుందని అప్పుడు ఎవరూ ఊహించి ఉండరేమో.
ఎందుకంటే సినిమా రిలీజ్ రోజు ‘మురారి’కి డివైడ్ టాక్ వచ్చింది. ఈ సినిమా కథ గురించి జనాలు రకరకాలుగా మాట్లాడుకున్నారు. నిడివి గురించి కూడా ఫిర్యాదులు వినిపించాయి. తొలి వారం సినిమాకు అనుకున్నంతగా వసూళ్లు రాలేదు. కానీ తర్వాత చూస్తే సినిమా భలేగా పుంజుకుంది. జనాలు థియేటర్లకు పరుగులు పెట్టారు. సినిమా మంచి వసూళ్లతో దూసుకెళ్లింది. దాదాపు అన్ని ప్రధాన సెంటర్లలో 100 రోజులు ఆడేసింది. ఇక ఈ చిత్రంలో మహేష్ బాబు పెర్ఫామెన్స్ గురించి, కృష్ణవంశీ దర్శకత్వ ప్రతిభ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పది సినిమాలతో వచ్చే అనుభవం ఈ ఒక్క సినిమాతో సంపాదించాడు మహేష్. పతాక సన్నివేశాల్లో అతడి నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. పాటలు, రొమాంటిక్ సీన్స్, సెంటిమెంట్ సీన్లు అద్భుతంగా కుదిరి సినిమాకు రిపీట్ ఆడియన్స్ వచ్చారు. సినిమాలో ప్రతి పాటా ఓ ఆణిముత్యమే.
మణిశర్మ అద్భుతమైన సంగీతం సమకూరిస్తే.. ఒక్కో పాటను ఒక్కో కళాఖండంలా తీర్చిదిద్దాడు కృష్ణవంశీ. ముఖ్యంగా అలనాటి రామచంద్రుడి పాట అయితే ఒక క్లాసిక్‌లా నిలిచిపోయింది. ఇప్పటికీ తెలుగు లోగిళ్లలో పెళ్లి అంటే ఈ పాట కచ్చితంగా ప్లే అవ్వాల్సిందే. ఆ పాటలో మాదిరి పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంటారు తెలుగు జనాలు. ఇంతకీ ‘మురారి’ విశేషాల గురించి ఇప్పడీ చర్చ ఎందుకు అంటే.. ఆ చిత్రం విడుదలై బుధవారానికి 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మురారి జ్ఞాపకాల్లో తడిసి ముద్దయిపోతున్నారు మహేష్ అభిమానులు.