పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీలో ఎంత స్పీడు మీదున్నాడో తెలిసిందే. ఐతే పునరాగమనంలో ఆయన చేస్తున్న సినిమాల్లో అతి తక్కువగా వార్తల్లో నిలుస్తున్నది, సాధ్యమైనంత గోప్యంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న సినిమానే. ‘వకీల్ సాబ్’ మొదలైన కొన్ని రోజులకే ఈ చిత్రం కూడా పట్టాలెక్కినప్పటికీ ఈ సినిమాకు సంబంధించి పెద్దగా విశేషాలేమీ బయటికి రాలేదు. ఇప్పటిదాకా టైటిల్, ఫస్ట్ లుక్ రివీల్ చేయలేదు.
ఇక సినిమా కాస్ట్ అండ్ క్రూ గురించి ఎప్పటికప్పుడు మీడియాలో వార్తలు వస్తూనే ఉణ్నాయి కానీ.. అధికారిక ప్రకటనలు కూడా పెద్దగా ఉండట్లేదు. ఐతే చిత్ర వర్గాల నుంచి ఎలాగోలా సమాచారం రాబట్టి అభిమానులతో ఆసక్తికర సమాచారాన్ని పంచుకుంటూనే ఉన్నారు మీడియా వాళ్లు. ఈ చిత్రంలో పవన్ వజ్రాల దొంగగా కనిపించనున్నాడని, ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నిధి అగర్వాల్‌లు కథానాయికలని, ఈ సినిమాకు ‘హరహర వీరమల్లు’ అనే టైటిల్ రిజిస్టర్ చేయించారని.. ఇలా ఎప్పటికప్పుడు న్యూస్ బ్రేక్ అవుతూనే ఉంది. తాజాగా ఇలాంటి విశేషమే ఒకటి బయటికి వచ్చింది.
ఈ చిత్రం కోసం మరో బాలీవుడ్ ఆర్టిస్టును క్రిష్ తీసుకొస్తున్నాడట. ఆ నటుడు మరెవరో కాదు.. అర్జున్ రాంపాల్ అని సమాచారం. అతణ్ని సినిమాలో నెగెటివ్ రోల్ కోసం ఎంచుకున్నట్లు తెలుస్తోంది. సినిమాలో అర్జున్‌ది ఔరంగజేబు పాత్ర అని.. అతడి రాజ్యంలో వజ్రాలు దొంగిలించే వీరమల్లుగా పవన్ కనిపించనున్నాడని అంటున్నారు.
అర్జున్ ఆల్రెడీ ఔరంగజేబు అవతారంలోకి మారిపోయాడని, అతడితో పవన్ కాంబినేషన్లో సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిగిందని చెబుతున్నారు. పవన్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో ఈ చిత్రాన్ని ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates