బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ పరంగా చూస్తే సౌత్ ఇండియా అనే కాదు.. ఇండియాలోనే బిగ్గెస్ట్ డైరెక్టర్ల జాబితాలో రాజమౌళి, శంకర్‌ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. కమర్షియల్ సినిమాకు కొత్త అర్థం చెప్పి.. ప్రాంతీయ చిత్రాలకు తిరుగులేని స్థాయి అందించిన ఘనత ఈ ఇద్దరి సొంతం. శంకర్ కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలతో అసాధారణమైన ఫాలోయింగ్, ఇమేజ్, మార్కెట్ సంపాదించుకుంటే.. కెరీర్లో తొలి అర్ధంలో మామూలు కమర్షియల్ సినిమాలే తీసిన రాజమౌళి.. ద్వితీయార్ధ:లో మగధీర, ఈగ, బాహుబలి లాంటి అద్భుత చిత్రాలతో ఎవ్వరూ అందుకోలేని స్థాయికి వెళ్లిపోయాడు.
ఈ ఇద్దరు దర్శకులతో పని చేయడానికి స్టార్ హీరోలు కూడా ఎంతగా తహతహలాడుతారో తెలిసిందే. వీరిలో ఒక్కరితో ఓ సినిమా చేసినా చాలని హీరోలు అనుకుంటారు. ఇక ఆ ఇద్దరితో సినిమా చేసే అవకాశం వస్తే..? ఇప్పటిదాకా ఆ ఘనత ఎవరికీ సొంతం కాలేదు. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆ అరుదైన అవకాశాన్ని అందుకున్నాడు.
ఇప్పటికే రాజమౌళితో ‘మగధీర’ లాంటి మెగా బ్లాక్‌బస్టర్ చేసిన రామ్ చరణ్.. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజయ్యాక రామ్ చరణ్ స్థాయే మారిపోతుందని అంతా అనుకుంటున్నారు. ప్రభాస్ లాగా పాన్ ఇండియా స్టార్‌గా అవతరించే అవకాశమున్న చరణ్.. దీని తర్వాత ఎలాంటి సినిమాను లైన్లో పెడతాడా అని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తుండగా.. అతను శంకర్‌తో సినిమాను ఓకే చేసుకున్నాడు.
రాజమౌళి, శంకర్‌లతో వరుసగా సినిమాలు చేసే అవకాశమంటే మామూలు విషయం కాదు. సౌత్ ఇండియా అనే కాదు.. ఇండియాలోనే మరే హీరోకూ సాధ్యం కాని విషయం. శంకర్‌తో పని చేయాలని టాలీవుడ్ స్టార్లలో చాలామంది ఆశపడ్డారు. చరణ్ తండ్రి చిరంజీవి సైతం ఆ కోరికను బహిరంగంగా వ్యక్తం చేసిన వాడే. కానీ ఆయనకు దక్కని అవకాశం చరణ్ దక్కించుకున్నాడు. శంకర్ ఒకప్పటి స్థాయిలో ఫామ్‌లో లేకపోయినా.. ఇప్పటికీ ఆయన శ్రద్ధ పెడితే అద్భుతమైన సినిమా తీయగలడన్న అంచనాలున్నాయి. చరణ్‌తో అలాంటి సినిమానే అందిస్తాడేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates