చిరు కోసం కోన వెంకట్


కోన వెంకట్.. ఒకప్పుడు రచయితగా వైభవం చూసిన ఈ వ్యక్తి కొన్నేళ్లుగా ప్రొడక్షన్‌కు పరిమితం అవుతున్నాడు. మంచి కాంబినేషన్లలో సినిమాలు సెట్ చేసి, అందుకు ప్రతిఫలంగా సినిమాలో వాటా పొందడం, ప్రొడక్షన్ చూసుకోవడం.. ఇలా నడుస్తోంది ఆయన కెరీర్. ‘నిశ్శబ్దం’ లాంటి ఒకట్రెండు సినిమాలకు మాత్రమే ఆయన గత కొన్నేళ్లలో రచన బాధ్యతలు తీసుకున్నారు. అది కూడా పూర్తి స్థాయిలో కాదు. రచయితగా కోన మార్కు చూసి చాలా కాలం అయిపోయింది. ఆయన్నో రచయితగానే గుర్తించట్లేదు ఈ మధ్య.

ఐతే చాలా గ్యాప్ తర్వాత ఓ భారీ చిత్రానికి కోన వెంకట్ రచన చేస్తున్నట్లు సమాచారం. అది మెగాస్టార్ చిరంజీవి ప్రాజెక్టు కావడం విశేషం. ఆయనతో కోన శిష్యుడు అనదగ్గ కె.ఎస్.రవీంద్ర (బాబీ) ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

ఇటీవలే ఆ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుందని అధికారికంగా ప్రకటించాడు మెగాస్టార్. ఈ చిత్రానికి స్క్రిప్టు పూర్తి కావస్తున్నట్లు సమాచారం. దీనికి కోన వెంకట్ రచనా సహకారం అందిస్తున్నాడట. అలాగే ‘పంతం’ సినిమాతో దర్శకుడిగా మారిన చక్రవర్తి కూడా ఈ సినిమాకు పని చేస్తున్నాడట. బాబీ ఇంతకుముందు చేసిన పవర్, జై లవకుశ సినిమాలకు కోన రచయితగా పని చేశాడు. బాబీ దర్శకుడిగా మారడంలో కోన సహకారం కూడా ఎంతో ఉంది. ఆయన్ని తన గురువులా భావిస్తాడు బాబీ.

వివిధ కారణాలతో గత కొన్నేళ్లలో రచన బాగా తగ్గించేసిన కోన.. చిరు సినిమాకు బాబీ విజ్ఞప్తి మేరకు స్క్రిప్టులో భాగమయ్యారట. ఐతే గతంతో పోలిస్తే కోన కలం పదును బాగా తగ్గిపోయినట్లు అనిపిస్తున్న నేపథ్యంలో చిరు సినిమాలో ఆయన ఏమాత్రం మెరుపులు మెరిపిస్తారో చూడాలి. ఈ సినిమాలో ఆయన రచన క్లిక్ అయితే మళ్లీ రైటర్‌గా బిజీ అవుతారేమో చూడాలి.