బాలయ్యను, నిర్మాతను బయటపడేసిన బోయపాటి


నందమూరి బాలకృష్ణ మార్కెట్ ఇన్నేళ్ల కెరీర్లో ఎన్నడూ లేనంతగా దిగజారిపోయింది గత రెండేళ్లలో. ముఖ్యంగా 2019 సంవత్సరం ఆయన్ని మామూలుగా దెబ్బ కొట్టలేదు. ఆ ఏడాది వచ్చిన ‘ఎన్టీఆర్: కథానాయకుడు’, ‘ఎన్టీఆర్: మహానాయకుడు’ చిత్రాలతో పాటు ‘రూలర్’ దారుణాతి దారుణ ఫలితాలందుకున్నాయి. అవి ఏ స్థాయిలో నష్టాలు తెచ్చిపెట్టాయి, ఎంత పెద్ద డిజాస్టర్లయ్యాయి అని ఇప్పుడు కొత్తగా చర్చించాల్సిన పని లేదు. అవి బాలయ్య మార్కెట్‌ను కూడా దారుణంగా దెబ్బ తీశాయి. ఈ స్థితి నుంచి బాలయ్య ఎలా కోలుకుంటాడా అని అందరూ సందేహించారు.

కానీ సరైన సమయంలో సరైన వ్యక్తితో జోడీ కట్టి బాలయ్య మార్కెట్ పరంగా పూర్వ వైభవం తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. తనకు సింహా, లెజెండ్ లాంటి బ్లాక్‌బస్టర్లు ఇచ్చిన బోయపాటితో జట్టు కట్టడంతో బాలయ్యపై మళ్లీ ట్రేడ్‌కు బాగానే నమ్మకం కుదిరినట్లుంది.

బాలయ్య-బోయపాటి సినిమాకు రూ.55 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ ఆఫర్లు వచ్చినట్లు సమాచారం. వివిధ ఏరియాలకు దాదాపుగా బిజినెస్ క్లోజ్ అయిపోయిందట. అన్ని ఏరియాల్లోనూ బాలయ్య కెరీర్ హైయెస్ట్ రేట్లు పలికినట్లు తెలుస్తోంది. ‘ఎన్టీఆర్’; ‘రూలర్’ లాంటి డిజాస్టర్ల తర్వాత బాలయ్య సినిమాకు ఇంత హైప్ వచ్చి, ఇలా బిజినెస్ జరుగుతోందంటే అది బోయపాటితో అతడి కాంబినేషన్‌కున్న క్రేజ్ పుణ్యమే. ఈ సినిమాతో బాలయ్యనే కాదు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డిని కూడా కష్టాలనుంచి బయటపడేశాడట బోయపాటి.

ఇంతకుముందు బోయపాటితోనే ‘జయ జానకి నాయక’ తీశాడు రవీందర్. ఆ చిత్రానికి బెల్లంకొండ సురేష్ నుంచి ఆర్థిక సహకారం అందినప్పటికీ ఆయనకు నష్టాలు తప్పలేదు. ఆ సినిమాకు సంబంధించి ఫైనాన్స్ ఇంకా క్లియర్ చేయకపోవడంతో బాలయ్య-బోయపాటి సినిమాకు ఒక దశలోకాసుల కటకట ఎదురైందట. అలాంటి టైంలోనే ఈ సినిమాకు బిజినెస్ ఓపెన్ చేయడం, బయ్యర్లు అడ్వాన్సులు కట్టడంతో సినిమాకు ఫైనాన్స్ సమస్యలన్నీ తీరిపోయినట్లు సమాచారం.