ప్రతి హీరోకూ కెరీర్లో ఒక స్పెషల్ ప్రొడ్యూసర్ ఉంటాడు. ఆ నిర్మాతతో సినిమా అంటే కంఫర్ట్ ఫీలవుతుంటారు. ప్రత్యేక అభిమానం చూపించడమే కాక.. మళ్లీ మళ్లీ వాళ్లతో సినిమాలు చేస్తుంటారు. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన కెరీర్లో అలాంటి నిర్మాత ఎ.ఎం.రత్నం అనే చెప్పాలి. పవన్‌తో ‘ఖుషి’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తీసిన నిర్మాత ఆయన. ఆ సినిమాకు ముందు రత్నం అటు తమిళంలో, ఇటు తెలుగులో భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండేవారు. టాప్ రేంజిలో ఉన్న ఆయనతో సినిమా చేయడానికి స్టార్ హీరోలు లైన్లో ఉండేవారు.
అలాంటి సమయంలో పవన్‌తో ‘ఖుషి’ తీసి అతడికి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారాయన. పవన్ కోసం మంచి సబ్జెక్ట్ ఎంచుకుని రాజీ లేకుండా నిర్మించి అతడి అభిమానాన్ని చూరగొన్నారాయన. అందుకే పవన్ మళ్లీ ఆయనతో ‘బంగారం’ సినిమా చేశాడు. స్వీయ దర్శకత్వంలో ‘సత్యాగ్రహి’ అనే సినిమాను కూడా రత్నంతో చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. అనివార్య కారణాలతో అది ఆగిపోయింది.
కొన్నేళ్ల కిందట రత్నంతో ఓ సినిమా మొదలుపెట్టినట్లే పెట్టి ఆపేసిన పవన్.. రాజకీయాల్లో బిజీ అయిపోయాడు. మళ్లీ సినిమాల్లోకి రావడం ఆలస్యం.. రత్నంతో ఓ సినిమా మొదలుపెట్టాడు. అదే క్రిష్ మూవీ. ఎన్నో ఏళ్ల కమిట్మెంట్‌ను ఈ సినిమాతో తీరుస్తున్నాడు పవన్. ఇదిలా ఉంటే గురువారం రత్నం పుట్టిన రోజు సందర్భంగా ఆయన్ని ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశాడు పవన్. అంతే కాదు.. రత్నం మీద తనకున్న ఆపేక్షను తెలియజేస్తూ మీడియాకు ఒక నోట్ కూడా ఇచ్చాడు.
తన మొత్తం కెరీర్లో తనతో సినిమా చేయమని అడిగిన నిర్మాత ఒక్క రత్నం మాత్రమే అని పవన్ తెలిపాడు. నెల్లూరులో తన మిత్రుడు ఒకరి ద్వారా రత్నంతో పరిచయం జరిగిందని, ఆయన్ని చెన్నైకి వెళ్లి కలుస్తుండేవాడినని.. ఈ క్రమంలోనే తనతో ఓ సినిమా చేయమని ఆయన్ని అడిగానని పవన్ వెల్లడించాడు. తన కోరికను మన్నిస్తూ ‘ఖుషి’ లాంటి ప్రత్యేకమైన సినిమాను తనకు అందించారని పవన్ గుర్తు చేసుకున్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates