‘రాజావారు రాణివారు’ అనే చిన్న సినిమాతో హీరోగా పరిచయమైన కుర్రాడు కిరణ్ అబ్బవరం. ఆ సినిమా ఉన్నంతలో బాగానే ఆడింది. కిరణ్‌కు మంచి పేరు తెచ్చింది. ఏ బ్యాగ్రౌండ్ లేకపోయినా కిరణ్‌కు కొత్తగా రెండు పేరున్న సినిమాల్లో అవకాశం దక్కింంటే అతడి టాలెంట్‌ను టాలీవుడ్ గుర్తించినట్లే ఉంది.
తొలి సినిమా తర్వాత అతను కమిటైన చిత్రం ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’. దీని టైటిల్, ఫస్ట్ లుక్, ఓ పాట ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ఇప్పుడు ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ టీజర్ వదిలారు. రాయలసీమ నేపథ్యంలో బాగానే వినోదం దట్టించినట్లే ఉంది ఈ టీజర్ చూస్తుంటే. రాయలసీమకే చెందిన కిరణ్.. భాష, యాసతో పాటు అక్కడి కుర్రాళ్ల యాటిట్యూడ్‌ను బాగానే తెరపైకి తీసుకొచ్చాడు. చేసింది ఒక్క సినిమానే అయినా ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’ టీజర్లో ప్రతి షాట్‌లోనూ అతను చూపించిన కాన్ఫిడెన్స్ ఆశ్చర్యపరిచేలా ఉంది.
టాలీవుడ్ కమర్షియల్ సినిమాల్లో ఎప్పుడూ చూసే హీరో పాత్రల మాదిరే ఉంది ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’లో హీరో పాత్ర. ఇంట్లో తల్లిదండ్రులతో తిట్లు తింటూ, అల్లరి చిల్లరిగా తిరుగుతూ, కాలేజీలో బ్యాక్ బెంచ్‌కు పరిమితమైన పాత్ర హీరోది. ఇలా ఉంటూనే హీరోయిన్ వెంట పడటం, ఆమెతో ప్రేమాయణం నడపడం మామూలే. చాలా వరకు రొటీన్ అనిపిస్తూనే ఫన్నీగా సాగిపోయింది టీజర్. అల్లరి చిల్లరిగా తిరిగే హీరో ఉన్నట్లుండి బాధ్యత నెత్తికెత్తుకుని తన స్నేహితులతో కలిసి ఒక కళ్యాణమండపాన్ని నడపాలని నిర్ణయించుకుంటే అతడికి ఎదురైన పరిస్థితులేంటన్న నేపథ్యంలో కథ నడుస్తుంది. హీరోయిజానికి కూడా మంచి స్కోప్ ఉన్నట్లే కనిపిస్తోంది టీజర్ చూస్తే.
‘ట్యాక్సీవాలా’ భామ ప్రియాంక జవాల్కర్ టీజర్లో అందంగా కనిపించగా.. హీరో తండ్రి పాత్రలో సాయికుమార్ బాగా హైలైట్ అయ్యాడు. సీమ యాసలో ఆయన డైలాగులు భలేగా పేలాయి. శ్రీధర్ గాదె అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రానికి ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ చేతన్ భరద్వాజ్ సంగీతాన్నందించాడు. టీజర్‌తో అంచనాలు రేకెత్తించిన ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.