కెరీర్లో ఎన్నడూ లేని విధంగా గత రెండు మూడేళ్లలో విమర్శలు ఎదుర్కొన్నాడు టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ఒకప్పటి స్థాయిలో అతడి సంగీతం లేకపోవడమే అందుక్కారణం. గత కొన్నేళ్లలో పెద్ద పెద్ద ప్రాజెక్టులే చేశాడు కానీ.. వాటిలో పాటలు, నేపథ్య సంగీతం ఆశించిన స్థాయిలో లేకపోయాయి. తన పాత ట్యూన్లనే రిపీట్ చేయడం, ఒక మూసలో వెళ్లిపోవడంతో విమర్శలు ఎదుర్కొన్నాడు.
ఒకప్పుడు ఊకదంపుడు ట్యూన్లతో విమర్శలు ఎదుర్కొన్న తమన్ తనను తాను రీఇన్వెంట్ చేసుకుని అదిరిపోయే ఆడియోలతో ఆశ్చర్యపరుస్తుంటే.. అదే సమయంలో దేవిశ్రీ అతడి ముందు నిలవలేకపోయాడు. గత ఏడాది సంక్రాంతికి తమన్ నుంచి వచ్చిన ‘అల వైకుంఠపురములో’, దేవి నుంచి వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలను పరిశీలిస్తే తేడా ఏంటో స్పష్టంగా తెలిసిపోతుంది. ఈ నేపథ్యంలో దేవిశ్రీ మారాలని, తమ అంచనాలకు తగ్గ ఓ మంచి ఆడియోతో తనేంటో రుజువు చేయాలని అభిమానులు ఆశించారు.
ఐతే దేవిశ్రీ తాను చేస్తున్న సినిమాలో కంటెంట్‌ను బట్టే ఔట్ పుట్ ఇస్తాడనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. సంగీతానికి ప్రాధాన్యం ఉన్న, మంచి ఫీల్ ఉన్న సినిమా పడితే.. అతను బౌన్స్ బ్యాక్ అవుతాడని ఆశించారు. ‘ఉప్పెన’ అలాంటి సినిమా లాగే కనిపిస్తోంది. ఈ సినిమా కోసం దేవి కంపోజ్ చేసిన ప్రతి పాటా ఆశ్చర్యపరుస్తోంది. అమితంగా ఆకట్టుకుంటూ వస్తోంది.
‘నీ కన్ను నీలి సముద్రం’ ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. అలాగే ‘దగ్ దగ్..’ సైతం ఆకట్టుకుంది. ఇప్పుడు ‘జల జల జలపాతం’ అంటూ మరో పాట రిలీజ్ చేశారు. ఇది ఇన్‌స్టంట్‌గా జనాలకు ఎక్కేస్తోంది. దేవిశ్రీ మంచి ఫీల్ ఉన్న రిఫ్రెషింగ్ ట్యూన్ అందిస్తే.. జస్‌ప్రీత్ జాజ్, శ్రియ ఘోషల్ ఆహ్లాదకరమైన గాత్రాలతో ఈ పాటకు ప్రాణం పోశారు. శ్రీమణి సాహిత్యం కూడా చక్కగా కుదిరింది. ఇక దర్శకుడు బుచ్చిబాబు సనా విజన్, శ్యామ్ దత్ విజువల్స్ కూడా తోడై ఈ పాట లిరికల్ వీడియో చాలా మంచి ఫీలింగ్ ఇస్తోంది. సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలను మరింత పెంచేలా ఉందీ పాట. ఈ సినిమాలో పాటల్లోనే కాదు నేపథ్య సంగీతంలోనూ దేవిశ్రీ ముద్ర బలంగానే ఉండబోతోందని, అతనేంటో ఫిబ్రవరి 12న చూస్తారని చిత్ర బృందం బలంగా చెబుతోంది.