పంచప్రాణాలు.. ఆ వెండి తాళాలు..

అసిస్టెంట్ డైరక్టర్ గా నేను నా రెండవ సినిమా ‘భోగిమంటలు’ అనే మూవీ చేయడం జరిగింది.. దానికి నిర్మాత సత్యకిషోర్.. రచన త్రిపురనేని మహారథి.. దర్సకత్వం.. శ్రీమతి విజయనిర్మల.. నిర్మాత సత్యకిషోర్ మహారథి గారి పెద్దబ్బాయి..

‘అమ్మాయి మొగుడు మామకు యముడు’ నా మొదటి సినిమా అయితే దానికి కూడా మహారథి గారు రచన.. వాళ్ళబ్బాయి సత్యకిషోర్ ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్.. నేను పని పట్ల చూపిస్తున్న ఉత్సాహం చూసి వాళ్ళు నన్ను ప్రొడక్షన్ హౌస్ తరపున అసిస్టెంట్ డైరక్టర్ గా పెట్టుకున్నారు.. కానీ అప్పటికే మేడం దగ్గర వున్న శేషు, కిషోర్ అనే సీనియర్లు నన్ను ఒక కంట కనిపెట్టివుండేవారు.. ఇక్కడ జరుగుతున్న సమాచారం నిర్మాతలకు చేరవేస్తానేమో అని.. నిజానికి మా మేడం ప్రొడ్యూసర్ సేఫ్టీ కి టాప్ ప్రేయారిటీ ఇచ్చేవారు.. కొన్ని పరీక్షలతర్వాత వాళ్ళు కూడా నా నిజాయితీని గమనించి తమలో చేర్చుకున్నారు..షూటింగ్ ఒక మేజర్ షెడ్యూల్ రామచంద్రపురం లో ప్లాన్ చేశారు.. షూటింగ్ కి కావాల్సిన స్పెషల్ ప్రాపర్టీస్ అన్నీ ప్యాక్ చేసి ఒక సూట్ కేస్ లో పెట్టి తాళం వేసి తీసుకెళ్ళాం…

ఇక్కడ మా మేడం వర్క్ స్టైల్ గురించి చెప్పాలి.. ఆమె మొత్తం యూనిట్ లో పనిచేసే ప్రతి ఒక్కరితో ఎంతో ప్రేమగా ఆప్యాయంగా ఉండేవారు.. కానీ షూటింగ్ విషయంలో చాలా నిర్దాక్షిణ్యంగా వ్యవరించేది.. దాదాపు అందరూ ఆర్టిస్టులు మా షూటింగ్ అంటే పది నిముషాలు ముందే వచ్చెవారు.. వాళ్ళు వేరే డైరక్టర్ల షూటింగ్ కి లేట్ గా వెళ్ళేవాళ్ళయినాసరే మేడం సెట్ అంటే చాలా జాగ్రత్తగా ఉండేవారు.. తేడావస్తే ‘ప్రొడ్యూసర్ డబ్బు ఇస్తేనేగా పనిచేస్తున్నారు.. అటువంటప్పుడు లేట్ గా ఎలావస్తారు.. మీకారణంగా వచ్చిన నష్టం మీరు కడతారా’ అని ముఖం మీదే అడిగేవారు..

రామచంద్రపురం లో షూటింగ్ ప్రారంభం అయింది.. మద్రాస్ నుంచి ప్రెస్ వాళ్ళు వచ్చారు ఓపెనింగ్ కవర్ చేసి వెళ్లిపోయారు… మూడవ రోజు పెద్దకోట లో షూట్.. అది రామచంద్రపురం లో ఒక రాజుగారిది.. ఫస్ట్ ఫ్లోర్ లో షూటింగ్.. గుమ్మడి గారు.. అంజలీదేవి గారు.. కృష్ణ గారు.. వీళ్ళతో సీన్ తీస్తున్నాం.. సీన్ మొదలైన వెంటనే తెలిసిన విషయం ఏమిటంటే ఆ సీన్ లో అంజమ్మ గారి చేతిలో ఉండాల్సిన వెండితాళాల గుత్తి లేదు.. మేము మద్రాస్ నుండి తీసికెళ్ళిన సూట్ కేస్ లో లేదు.. పొరపాటు జరిగిపోయిందని తెలుసుకున్న కో డైరక్టర్ శేషు.. ఆర్ట్ అసిస్టెంట్ యాదు టెన్షన్ పడుతున్నారు.. శేషు తర్వాత నా పై ప్లేస్ లో వున్న కిషోర్ అనే సీనియర్ అసిస్టెంట్ కూడా హడావిడిగా వెతికిన సూట్ కేస్ నే మళ్ళీ మళ్ళీ వెతుకుతున్నారు…

అప్పుడు నాకొక ఆలోచన వచ్చింది.. పరిగెత్తుకుంటూ క్రిందకు వెళ్లాను.. గేట్ దగ్గర ఇద్దరు సెక్యూరిటీ వాళ్ళు లోపలికి ఎవర్నీ రానియ్యకుండా గేట్ మూసి నిలబడివున్నారు.. నా కళ్ళు గేటుకి అవతల వున్న వాళ్ళను వెతకసాగాయి.. ఒక పెద్దావిడ.. పండు ముత్తైదువ కనిపించింది.. ఆమె చీరకుచ్చిళ్ళ వైపు చూసాను.. నా కళ్ళు ఆనందంతో మెరిసాయి.. ఆమె తళతళ మెరిసే వెండితాళాల గుత్తి బొడ్లో దోపుకునివుంది.. ఆమెను లోనికి రానియ్యమని సెక్యూరిటీ వాడికి చెప్పాను.. ఆమె గేటులోపలికి రాగానే.. ‘షూటింగ్ చూస్తారా’ అంటే ‘అవును’ అంది.. ‘మీ వెండి తాళాలగుత్తి నాకిస్తే నేను షూటింగ్ చూపిస్తాను’ అని చెప్పాను.. ‘నేను ఇవ్వను’ అంది.. ‘కాదు మామ్మగారు మీ తాళాలు అంజలీదేవిగారి చేతిలో ఉంటాయి.. సినిమాలో కనబడతాయి.. మళ్ళీ మీ తాళాలు మీకు ఇస్తాను’ అని బ్రతిమాలితే ఒప్పుకుంది..

తాళాలు తీసుకుని.. ‘మీరు నెమ్మదిగా రండి’ అని నేను పైకి పరిగెత్తాను.. ఇంకో నాలుగు మెట్లు ఫస్ట్ ఫ్లోర్ ఉందనగా.. మెట్లమీద బర్ల కిషోర్ కూర్చుని సిగరెట్ తాగుతున్నాడు.. నాచేతిలో వెండితాళాలు కనబడగానే సిగరెట్ క్రింద పడేసి నా చేతిలో తాళాలు లాక్కుని పైకి పరిగెత్తి అంజమ్మ గారి చేతిలో తాళాలు పెట్టి ‘రెడీ మేడం’ అన్నాడు.. అప్పుడు మేడం శేషు వైపు తిరిగి ‘వాడ్ని చూసి నేర్చుకో.. తప్పు జరిగిపోయినప్పుడు దాన్ని దిద్దుకునే తెలివితేటలుండాలి.. దానినే సమయస్పూర్తి అంటారు’.. అన్నారు… అప్పుడు నేను మనసులో అనుకున్నాను సమయస్పూర్తి నాదా.. కిషోర్ దా అని…..ఇప్పటికీ ఆ ప్రశ్న నన్ను వెంటాడుతూనే ఉంటుంది…

— శివ నాగేశ్వర రావు