ప్రభాస్ హీరోగా వైజయంతీ మూవీస్ నిర్మాణంలో నాగ్ అశ్విన్ రూపొందించనున్న చిత్రం స్థాయి ఏంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. రూ.400 కోట్లకు పైగా బడ్జెట్లో ఈ సినిమా తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్‌యే స్వయంగా ప్రకటించారు. ముందు నుంచి దీన్ని అంతర్జాతీయ స్థాయి సినిమాగానే చెబుతున్నారు. ‘ఆదిత్య 369’ మోడర్న్ వెర్షన్‌గా దీన్ని అభివర్ణిస్తున్న సంగతీ తెలిసిందే. ఇంత పెద్ద స్థాయి సినిమా అన్నాక ఇండియాలో టాప్ టెక్నీషియన్లను తీసుకోవడానికి చూస్తారు ఎవరైనా.
దేశవ్యాప్తంగా పాపులారిటీ, రేంజ్ అన్నీ చూసుకుని టెక్నీషియన్ల ఎంపిక జరుగుతుందని అనుకుంటారు. కానీ నాగ్ అశ్విన్ మాత్రం భిన్నమైన దారిలో నడిచాడు. బ్రాండ్ వాల్యూ, పాపులారిటీ వంటి విషయాలు పట్టించుకోకుండా తన కంఫర్ట్ చూసుకున్నాడు. తన అభిరుచికి తగ్గట్లు పని చేసే, తనతో మంచి సమన్వయం ఉన్న టెక్నీషియన్లనే ఎంచుకున్నాడు.
‘మహానటి’కి తన ఛాయాగ్రహణంతో డానీ లోపెజ్ సాంచెజ్, తన సంగీతంతో మిక్కీ జే మేయర్ ఎలా ప్రాణం పోశారో తెలిసిందే. ఆ సినిమా క్లాసిక్ స్టేటస్ అందుకోవడంలో వాళ్లిద్దరిదీ కూడా ముఖ్య పాత్ర.
ఐతే ప్రభాస్ సినిమా రేంజ్ ఎక్కువ కాబట్టి ఇంకా పెద్ద స్థాయి టెక్నీషియన్లను తీసుకుందామనో.. సంగీతం విషయానికి వస్తే పాటలు వేర్వేరు సంగీత దర్శకులతో, నేపథ్య సంగీతం ఒకరితో చేయించి దీని రేంజ్ పెంచుదామనో అశ్విన్ చూడలేదు. తన టెక్నీషియన్ల రేంజ్ చూడకుండా వాళ్ల టాలెంట్ మీద నమ్మకం పెట్టాడు. తనకేం కావాలో వాళ్ల నుంచి రాబట్టుకోగలనని నమ్మాడు. అందుకే డానీ, మిక్కీలను ఎంచుకున్నాడు. ఇది ఒక రకంగా ప్రభాస్ నేర్చుకోవాల్సిన పాఠమే.
‘సాహో’ విషయంలో ఈ స్పష్టత లేక సంగీతం విషయంలో కంగాళీ అయింది. పాన్ ఇండియా సినిమా అని చెప్పి.. లోకల్ సంగీత దర్శకుల్ని అతను నమ్మలేదు. బాలీవుడ్ మీద పడింది చిత్ర బృందం. ఒక్కో సంగీత దర్శకుడితో ఒక్కో పాట చేయించారు. బ్యాగ్రౌండ్ స్కోర్ ఒకరితో చేయించుకున్నారు. ఈ విషయంలో బాగా హడావుడి అయింది. చివరికి చూస్తే పాటలు సినిమాకు ప్లస్ కాలేకపోయాయి. బ్రాండ్ కోసం చూసి అయిన కాడికి ఖర్చు పెడితే చివరికి వచ్చిన ఫలితమిది. అశ్విన్ అలా కాకుండా మిక్కీ మీద భరోసా ఉంచాడు. ‘సాహో’ అనుభవం తర్వాత ‘రాధేశ్యామ్’ సంగీత దర్శకుడి విషయంలోనూ మీనమేషాలు లెక్కించిన చిత్ర బృందం.. చాలా ఆలస్యంగా ‘డియర్ కామ్రేడ్’ ఫేమ్ జస్టిన్ ప్రభాకరన్‌కు బాధ్యతలు అప్పగించింది. బహుశా అశ్విన్ ప్రభావం కూడా ప్రభాస్ మీద కొంత ఉండి ఉండొచ్చేమో. ‘ఆదిపురుష్’ విషయంలోనూ ‘సాహో’ మాదిరి ప్రభాస్ అండ్ కో ‘అతి’ చేయకుంటే మంచిది.