లాక్ డౌన్ తర్వాత టాలీవుడ్ జోరు మామూలుగా లేదు. షూటింగ్స్, కొత్త సినిమాల విడుదల, అలాగే రాబోయే చిత్రాల రిలీజ్ డేట్ల ప్రకటనలో టాలీవుడ్ మామూలు దూకుడు మీద లేదు. దేశంలోని మిగతా ఇండస్ట్రీలన్నీ కరోనా ప్రభావం నుంచి ఇంకా కోలుకోలేక స్తబ్దుగా ఉంటే.. టాలీవుడ్ మాత్రం భలేగా బౌన్స్ బ్యాక్ అయి యమ స్పీడు మీద ముందుకు వెళ్లిపోతోంది. లాక్ డౌన్ గ్యాప్ తర్వాత ఇండియాలో ముందుగా సినిమాల షూటింగ్ పున:ప్రారంభమైంది ఇక్కడే.
చిన్నా పెద్దా అని తేడా లేకుండా ఒకదాని తర్వాత ఒకటి పదుల సంఖ్యలో సినిమాలు మళ్లీ సెట్స్ మీదికి వెళ్లాయి. పక్కా ప్లానింగ్‌తో రంగంలోకి దిగి మునుపటి కంటే వేగంగా సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు ఫిలిం మేకర్స్. కొన్ని నెలల్లోనే సినిమాలను ముగించేస్తుండటం.. వరుసబెట్టి రిలీజ్ డేట్లు ప్రకటిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. మేకింగ్ దశలో ఉన్న చాలా సినిమాల రిలీజ్ డేట్లను కూడా చాలా ముందే ప్రకటిస్తున్నారు.
కొత్త సినిమాల విడుదల విషయంలోనూ టాలీవుడ్‌కు మరే పరిశ్రమా సాటి వచ్చే స్థితిలో లేదు. సంక్రాంతికి ఏకంగా నాలుగు సినిమాలు రిలీజయ్యాయి మన దగ్గర. ఆ తర్వాతి వారాల్లో కూడా సినిమాలు వస్తూనే ఉన్నాయి. వచ్చే నెలలో అటు ఇటుగా పది సినిమాలు రిలీజవుతున్నాయి. మార్చిలో కూడా సినిమాల మోత మోగనుంది. అన్నింటికీ మించి గత కొన్ని రోజులుగా వరుసబెట్టి కొత్త సినిమాల రిలీజ్ డేట్ల అనౌన్స్‌మెంట్లు వస్తూనే ఉన్నాయి. అందులో కొన్ని పాన్ ఇండియా సినిమాలు, దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నవి కూడా ఉణ్నాయి.
ప్రేక్షకులకు ఊపిరి సలపనివ్వకుండా కొత్త సినిమాల విడుదల ప్రకటనలు వస్తూనే ఉన్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో బాలీవుడ్లో ఒక కలకలమే రేగింది. అలాగే ఆచార్య, పుష్ప, సర్కారు వారి పాట, మేజర్, నారప్ప లాంటి వివిధ భాషల వాళ్లను ఆకర్షించే సినిమాల రిలీజ్ డేట్లు కూడా వచ్చేశాయి. దేశంలో మరే ఇండస్ట్రీలో కూడా ఇంత యాక్టివిటీ కనిపించడం లేదు. లాక్ డౌన్ తర్వాత మనోళ్లు చూపిస్తున్న దూకుడుకు మిగతా ఇండస్ట్రీలు బెంబేలెత్తిపోతున్నాయంటే అతిశయోక్తి కాదు. మనోళ్ల సామర్థ్యమేంటో ఇప్పుడు అందరికీ బాగానే తెలిసొస్తోంది.