టామ్ హాంక్స్ మెచ్చిన మహారాజ

గత కొన్నేళ్లలో కోలీవుడ్లోనే కాదు ఇండియన్ సినిమాలోనే అత్యుత్తమ చిత్రాల్లో ‘మహారాజ’ ఒకటి. విజయ్ సేతుపతి లీడ్ రోల్ చేసిన ఈ చిత్రాన్ని నిథిలన్ స్వామినాథన్ అనే కొత్త దర్శకుడు రూపొందించాడు. థియేటర్లలో రిలీజ్ అయినపుడు ఈ మూవీ అటు తమిళంలో, ఇటు తెలుగులో ఘనవిజయం సాధించింది. ఓటీటీలోకి వచ్చాక మిగతా భాషల్లోనూ ఆదరణ పొందింది. దీని రీచ్ మరింత పెరిగింది.

ఈ సినిమా స్క్రీన్ ప్లేను ఫిలిం స్కూల్స్‌లో పాఠ్యాంశంగా చేర్చేంత గొప్పగా ఉంటుంది. సినిమా రిలీజ్ అయి రెండేళ్లు దాటినా దీని గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ సినిమా ఇప్పుడు హాలీవుడ్లో కూడా రీమేక్ అవుతున్నట్లు నిర్మాత సుధన్ ఇటీవలే వెల్లడించాడు కూడా. అయితే హాలీవుడ్లో ఈ సినిమా రిలీజ్ కావడానికి ముందే ఒక మేటి నటుడి నుంచి ప్రశంసలు పొందడం విశేషం. ఆ నటుడు మరెవరో కాదు టామ్ హాంక్స్.

ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ బోర్డు సభ్యురాలు కవితా గుప్తా, ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాతో మాట్లాడుతూ ఈ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఎల్‌ఏసీఎంఏ గాలా వేడుకలో టామ్ హాంక్స్ తనతో మాట్లాడుతూ ఏవైనా మూడు ఇండియన్ మూవీస్ సజెస్ట్ చెయ్యమని అడిగాడు.. అప్పుడు తాను ‘మహారాజ’ పేరు చెప్పానని కవితా గుప్తా తెలిపారు. ఆ తర్వాత మరో వేడుకలో కలిసినప్పుడు టామ్ హాంక్స్ స్వయంగా ఈ సినిమా ప్రస్తావన తెచ్చారన్నారు. 

ఈ చిత్రంపై ప్రశంశలు కురిపించడంతో పాటు ఇందులో విజయ్ సేతుపతి కూతురి పాత్రలో నటించిన సచానా నమిదాస్ నటనను కొనియాడారని.. “నేను ఇంకా ఆ అమ్మాయి నటన నుంచి బయటపడలేకపోతున్నాను” అని కామెంట్ చేశారని ఆమె వెల్లడించారు. ఆ కథలో తండ్రి పాత్ర చేసినట్లుగా తాను చేసి ఉండలేనని.. తనకైతే ఆ విలన్‌ను చంపేయాలన్నంత కోపం వచ్చేదని టామ్ హాంక్స్ భావోద్వేగంతో స్పందించినట్లు కవిత తెలిపారు. ఫారెస్ట్ గంప్, కాస్ట్ అవే సహా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యుత్తమ నటుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న టామ్ హాంక్స్ నుంచి ఇలాంటి ప్రశంసలు పొందడం మహారాజ టీంకు గర్వకారణమే.