నితిన్ సినిమా.. జస్ట్ 48 రోజుల్లో

ఈ రోజుల్లో చిన్న సినిమాలకు కూడా వర్కింగ్ డేస్ బాగా పెరిగిపోతున్నాయి. ఒకప్పటిలా నెలా రెండు నెలల్లో సినిమాలు తీసే రోజులు పోయాయి. మిడ్ రేంజ్ సినిమాలను కూడా నెలల తరబడి తీస్తున్నారు. కొన్నిసార్లు వాటికి కూడా సంవత్సరాలు పట్టిపోతున్నాయి. ఇలాంటి టైంలో నితిన్ లాంటి నోటబుల్ హీరో సినిమాను కేవలం 48 రోజుల్లో పూర్తి చేశారంటే ఆశ్చర్య పోవాల్సిందే.

నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో నితిన్ హీరోగా తెరకెక్కిన అలియాస్ రుక్మిణి చిత్రాన్ని ఇంత తక్కువ వర్కింగ్ డేస్ లోనే పూర్తి చేసిందట టీం. ఈ విషయాన్ని నితిన్ ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో వెల్లడించాడు. అలియాస్ రుక్మిణి షూటింగ్ ఆగస్టు 17న మొదలైందని.. డిసెంబర్ 4న, అంటే షూట్ ఆరంభమైన 108 రోజుల్లోనే రిలీజ్ చేస్తున్నామని.. కేవలం 48 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేశామని నితిన్ తెలిపాడు.

సినిమా మొదలవడానికి ముందే తన చేతికి బౌండ్ స్క్రిప్ట్ వచ్చిందని.. అప్పటికే నాని సోదరి, నిర్మాత దీప్తి తన టీంతో కలిసి లొకేషన్లు, ఆర్టిస్టులు సహా అన్ని ఫైనలైజ్ చేసి పక్కా ప్లానింగ్ తో షూటింగ్ మొదలుపెట్టడం వల్లే సినిమా ఇంత వేగంగా పూర్తయిందని నితిన్ చెప్పాడు.

ఇక అలియాస్ రుక్మిణి తన కెరీర్ లోనే బెస్ట్ ఫిలిం అనే సారీ మాటను మరోసారి నొక్కి వక్కాణించాడు నితిన్. ఈ సినిమా తనకు ఎంత స్పెషల్ చెబుతూ ఎప్పుడో షూటింగ్ పూర్తయినప్పటికీ ఇంకా ఈ సినిమా లుక్ ను కంటిన్యూ చేస్తూ కళ్ళజోడు పెట్టుకుంటున్నట్లు నవ్వుతూ నితిన్ చెప్పాడు. ఈ చిత్ర దర్శకుడు మురళీకాంత్ ను నితిన్ బాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీతో పోల్చడం విశేషం. నాని లేకుంటే ఈ సినిమా లేదని కమర్షియల్ సినిమాలు చేసుకునే తనతో ఇలాంటి సినిమా చేయించడం తన ఘనతే అని నితిన్ చెప్పాడు.