సాత్విక వీరవల్లి.. గత వారం రోజులుగా చర్చనీయాంశం అవుతున్న పేరు. దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాదినేని దర్శకత్వంలో గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా లాంటి పెద్ద బ్యానర్లు ప్రజెంట్ చేసిన ఆకాశంలో ఒక తార చిత్రంతో ఈ కొత్తమ్మాయి కథానాయక పరిచయమైంది. తొలి సినిమా అయినా ఎలాంటి బెరుకు లేకుండా కల్పన పాత్రను అద్భుతంగా పోషించి ప్రశంసలు అందుకుంది సాత్విక.
తన ఇంటి పేరు చూస్తే తెలుగమ్మాయి అనే విషయం అర్థమైపోతుంది కానీ ఆమెకు తెలుగు రాదు. ఈ సినిమాకు సంబంధించి ప్రమోషనల్ ఈవెంట్లలో, అలాగే ఇంటర్వ్యూల్లో సాత్విక పరభాష కథానాయకలాగా పొడిపొడిగా, కొంచెం కష్టంగా తెలుగు మాటలు పలకడం, అమెరికన్ యాక్సెంట్ ఇంగ్లీష్ మాట్లాడడం ఒకింత ఆశ్చర్యం కలిగించాయి. అయితే తాను తెలుగు అమ్మాయే అయినప్పటికీ తన తెలుగు ఎందుకలా ఉందో తన కుటుంబం నేపథ్యం ఏంటో ఒక ఇంటర్వ్యూలో సాత్విక వివరించింది.
సాత్విక తండ్రి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు దగ్గరగా ఉండే వీరవల్లి గ్రామానికి చెందినవాడట. అయితే ఆయన కుటుంబం తమిళనాడులోని కంచిలో స్థిరపడిందట. ఆయన పెరిగింది అక్కడేనట. సాత్విక తండ్రి ఒక తమిళ అమ్మాయినే పెళ్లి చేసుకున్నారట. అందువల్ల తమ కుటుంబమంతా ఇంట్లో తమిళమే మాట్లాడుతుందని సాత్విక వెల్లడించింది.
కానీ తన తండ్రికి తెలుగు మూలాలు ఉండడం, ఆయన కొన్నేళ్ల పాటు హైదరాబాదులో పని చేయడం వల్ల తెలుగు వచ్చని.. ఆయన తెలుగు రాస్తారని, చదువుతారని సాత్విక చెప్పింది. ఆయన ద్వారా తాను కొద్దికొద్దిగా తెలుగు నేర్చుకున్నట్లు సాత్విక వెల్లడించింది.
తాను పుట్టి పెరిగింది అమెరికాలో కావడంతో అక్కడి యాసలోనే ఇంగ్లీష్ మాట్లాడతానని, ఇంట్లో అందరూ తమిళం మాట్లాడడం వల్ల తనకు ఆ భాష మీద పట్టు వచ్చిందని ఆమె చెప్పింది. తన తండ్రి పుట్టిన ఊరు నుంచే తమ ఇంటి పేరును తీసుకున్నట్లు సాత్విక వెల్లడించింది.
ప్రస్తుతానికి తనకు తెలుగు మీద అంతగా పట్టు లేదని, కానీ త్వరలో ఈ భాష బాగా నేర్చుకుని అచ్చమైన తెలుగు అమ్మాయి అనిపించుకుంటానని సాత్విక ధీమా వ్యక్తం చేసింది. ముందు తాను దుల్కర్ నటించిన కాంత సినిమాకు ఆడిషన్ ఇచ్చానని, కానీ అందులో అవకాశం రాకపోయినా.. దుల్కరే నటించిన ఆకాశంలో ఒక తారతో కథానాయక పరిచయమయ్యే అదృష్టం దక్కిందని సాత్విక సంతోషం వ్యక్తం చేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates