పట్టువదలని విక్రమార్కుడి బిరుదు ఎవరికైనా ఇవ్వాలంటే ముందు వరసలో ఉండే వాళ్లలో విజయ్ ఆంటోనీ పేరు ఉంటుంది. ఎందుకంటే బిచ్చగాడు బ్లాక్ బస్టర్ అయ్యాక తన సినిమాలు చాలా వచ్చి, వాటిలో అత్యధిక శాతం డిజాస్టర్లు అయినా ఇంకా విభిన్నమైన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా తెలుగులో తన మార్కెట్ బాగా తగ్గిపోయింది. ఇప్పటికీ బిచ్చగాడు బ్రాండ్ తోనే జనాలు గుర్తు పడుతున్నారు, బయ్యర్లు బిజినెస్ చేస్తున్నారు. ఈ క్రమంలో తన కొత్త మూవీ వస్తోంది.
నవంబర్ 20 తమిళంలో అప్పాకుట్టి రిలీజయ్యింది. డీసెంట్ రివ్యూలు, టాక్ వచ్చాయి. అయితే ఓమ్ తాకిడి వల్ల తొలుత ఇబ్బంది పడినప్పటికీ క్రమంగా పుంజుకుంటోందని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. మన దగ్గర ఈ నగరానికి ఏమైంది రిపీట్, ఆకాశంలో ఒక తార రూపంలో తీవ్రమైన కాంపిటీషన్ ఉండటం వల్ల అప్పాకుట్టిని సమాంతరంగా విడుదల చేయలేదు. ఇప్పుడు నాన్న కుట్టి పేరుతో నవంబర్ 27 ఏపీ తెలంగాణ థియేటర్లకు తీసుకొస్తున్నారు. బజ్ పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
విజయ్ ఆంటోనీ స్వయంగా రంగంలోకి దిగి హైదరాబాద్ మెట్రో స్టేషన్లతో పాటు రోడ్ల మీద తిరుగుతూ బజ్జీలు వేస్తూ పబ్లిక్ ని కలుస్తూ తన సినిమా చూడమని పబ్లిసిటీ చేసుకుంటున్నాడు. హఠాత్తుగా తను ఎక్కడబడితే అక్కడ కనిపించడంతో షాకవుతున్న జనాలు ఫోటోలు తీసుకుంటూ టికెట్లు కొంటామని హామీ ఇస్తున్నారు. గతంలో విజయ్ ఆంటోనీ ఇలాంటివి చాలా చేశాడు. కానీ వీక్ కంటెంట్స్ వల్ల ఆయా సినిమాలు ఆశించిన ఫలితం అందుకోలేక తిరస్కారానికి గురయ్యాయి.
ఇక నాన్న కుట్టి విషయానికి వస్తే ఇదో తండ్రి కూతుళ్ళ కథ. అలాని కేవలం సెంటిమెంట్ ఎమోషన్ ఉండదు. చిన్న క్రైమ్ ఎలిమెంట్ తో పాటు సస్పెన్స్ జోడించి డిఫెరెంట్ గా చెప్పే ప్రయత్నం చేశారు. మారన్ దర్శకత్వం వహించగా హీరోనే సంగీతం, ఎడిటింగ్ బాధ్యతలు చూసుకున్నారు. ప్రీతీ అస్రాని హీరోయిన్ గా నటించింది. శర్వానంద్ భోగితో తలపడుతున్న నాన్న కుట్టికి ఈసారైనా జనం ఆదరణ కలిగిస్తారో లేదో చూడాలి. అన్నట్టు బిచ్చగాడు 3 స్క్రిప్ట్ పనులు మొదలయ్యాయని టాక్.
Gulte Telugu Telugu Political and Movie News Updates