ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ ‘ఆర్జీవీ ఫిలిం ఫ్యాక్టరీ’ అని నిర్మాణ సంస్థ పెట్టి అనేకమంది శిష్యులను దర్శకులుగా పరిచయం చేశాడు. నటులు, టెక్నీషియన్లు కూడా అనేకమందిని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ప్రస్తుతం టాలీవుడ్లో అదే స్థాయిలో శిష్యులను ప్రోత్సహిస్తూ దర్శకులుగా అవకాశాలు కల్పిస్తున్న ఘనత సుకుమార్ సొంతం. బుచ్చిబాబు, హరిప్రసాద్ జక్కా, శ్రీకాంత్ ఓదెల, పల్నాటి సూర్యప్రతాప్.. ఇలా చాలామంది సుకుమార్ శిష్యులు ఇప్పటికే దర్శకులుగా మారారు.
ఇప్పుడు ఈ జాబితాలోకి వీరా కోగటం అనే కొత్త దర్శకుడు వచ్చాడు.
కిరణ్ అబ్బవరం హీరోగా వీరా దర్శకత్వంలో కొత్త సినిమా సోమవారమే ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ చిత్రంలో సుకుమార్ కూడా నిర్మాణ భాగస్వామి కావడం విశేషం. ఆయన అన్న కొడుకు అశోక్ బండ్రెడ్డి (దర్శకుడు సినిమా హీరో) కూడా ఈ చిత్రంతో నిర్మాతగా పరిచయం అవుతుండడం విశేషం. ప్రస్తుతం టాలీవుడ్ హ్యాపెనింగ్ ప్రొడ్యూసర్లలో ఒకడైన వంశీ నందిపాటి ఈ చిత్రానికి మరో నిర్మాత.
కిరణ్ అబ్బవరం 14వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘రికార్డ్’ అనే టైటిల్ కూడా ఖరారైంది. సుకుమార్ సినిమాల్లో చాలా వరకు రా అండ్ రస్టిగ్గా ఉంటాయి. వాటిలో థ్రిల్లర్ లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు సుకుమార్ శిష్యుడు వీరా తీస్తున్న సినిమా కూడా ఆ కోవకు చెందిందే. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో కర్నూలు నగరంలో నడిచే కథ ఇది. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను గమనిస్తే.. ఇది మొబైల్ రికార్డింగ్ చుట్టూ నడిచే కథ అని, క్రైమ్ ఎలిమెంట్ కీలకంగా ఉంటుందని అర్థమవుతోంది.
ఇందులో హీరోయిజం కూడా బాగానే ఉంటుందని సమాచారం. సొసైటీలో ఉన్న ఒక బర్నింగ్ ఇష్యూ చుట్టూ నడిచే ఈ కథలో జనాలు బాగా రిలేట్ చేసుకునే అంశాలు ఉంటాయిన తెలిసింది. వీరా మీడియా బ్యాగ్రౌండ్ నుంచి రావడం విశేషం. అతను దాదాపు రెండు దశాబ్దాల పాటు ‘ఈనాడు’ దినపత్రికలో డెస్క్ ఇన్చార్జ్గా సహా వివిధ హోదాల్లో పని చేశాడు. అతను కర్నూలు జిల్లా ఈనాడు ఇన్చార్జ్గా ఉన్న సమయంలో అక్కడ ఎదురైన అనుభవాల ఆధారంగా ఈ కథ తయారు చేసినట్లు సమాచారం.
సుకుమార్ దగ్గర పుష్ప, పుష్ప-2 సినిమాలకు రచన-రీసెర్జ్ విభాగాల్లో పని చేసిన వీరా.. రామ్ చరణ్‌తో సుకుమార్ తీయబోయే కొత్త సినిమాకు కూడా రచనా సహకారం అందించాడు. తక్కువ సమయంలోనే సుకుమార్ అభిమానం చూరగొని, ఆయన సొంత నిర్మాణ సంస్థలో సినిమా చేసే అవకాశం అందుకున్నాడు. క, కే ర్యాంప్, చెన్నై లవ్ స్టోరీ లాంటి హిట్లతో దూసుకెళ్తున్న కిరణ్ అబ్బవరం.. వీరా కథను మెచ్చి ఈ సినిమాకు పచ్చజెండా ఊపాడు. త్వరలోనే చిత్రీకరణకు వెళ్లబోతున్న ఈ చిత్రం.. వచ్చే వేసవిలో విడుదల కానుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates