బుల్లితెర దేవరకు మోక్షం దొరికింది

జూనియర్ ఎన్టీఆర్ లాంటి ప్యాన్ ఇండియా హీరో, ఆర్ఆర్ఆర్ ఇండస్ట్రీ హిట్ తర్వాత చేసిన సినిమాగా దేవర ఎంత సంచలనం రేపిందో చూశాం. కొరటాల శివ దర్శకత్వంలో అనిరుధ్ రవిచందర్ సంగీతంతో రెండేళ్ల క్రితం సృష్టించిన రికార్డులు ఇప్పటికీ తారక్ అభిమానులు గుర్తు చేసుకుంటూ ఉంటారు. దేవర పార్ట్ 2 వస్తుందో లేదో కానీ మొదటి భాగం తాలూకు జ్ఞాపకాలు, థియేటర్ వైబ్స్ వాళ్ళు ఎప్పటికి మర్చిపోలేరు. నెట్ ఫ్లిక్స్ లోనూ వ్యూస్ పరంగా దేవర కొత్త మైలురాళ్ళు నమోదు చేసింది.

ఇదంతా బాగానే ఉంది కానీ ఒక్క లోటు దేవరని వెంటాడుతూ వచ్చింది. అదే శాటిలైట్ హక్కులు అమ్ముడుపోకపోవడం. నిర్మాత కళ్యాణ్ రామ్ ఆశించిన ధర రాకనో లేక అప్పటి మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఛానల్స్ రిస్క్ చేయలేకపోవడం వల్లనో ఏదైతేనేం బుల్లితెర మీద చూడాలని వెయిట్ చేస్తున్న అభిమానులకు నిరాశ మిగిలింది. ఇంత సుదీర్ఘమైన నిరీక్షణ తర్వాత సోని తెలుగు ఛానల్ దేవర హక్కులను సొంతం చేసుకుందని సమాచారం. ధర రివీల్ చేయలేదు కానీ మంచి డీల్ కుదిరిందట.

త్వరలోనే సోనీ తెలుగు ఛానల్ ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో భాగంగానే టాలీవుడ్ సినిమాలను కొనే పనిని టీమ్ ఉదృతం చేసింది. కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీ కొనడం అందులో భాగమే. దేవర లాంటి పెద్ద చిత్రాలు తీసుకోవడం ద్వారా టీవీ ఛానల్స్ చూసే మిడిల్ క్లాస్ ఆడియన్స్ ని సోనీ తెలుగు టార్గెట్ చేసుకున్నట్టవుతుంది. దేవర ఓటిటిలో తప్ప బయట ఇంకెక్కడా రాలేదు. సో బుల్లితెర మీద మొదటిసారి వస్తున్నప్పుడు ఆదరణ దక్కే అవకాశాలను కొట్టి పారేయలేం.

దీని సంగతలా ఉంచితే దేవర విషయంలో జరిగిన జాప్యం ఒక పాఠంగా తీసుకోవాలి. ఒకప్పటిలా శాటిలైట్ మార్కెట్ బలంగా లేదు. ఓటిటిలు వచ్చాక జనాలు ప్రకటనలు భరిస్తూ మూడు గంటలు కదలకుండా టీవీ ముందు కూచునే పరిస్థితులు లేవు. తమకు అనుకూలమైన టైంలో చూసే వెసులుబాటు ఇచ్చే ఓటిటికు బాగా అలవాటు పడిపోయారు. అందుకే ఎంటర్ టైన్మెంట్ ఛానల్స్ సినిమాలు కొనే విషయంలో దూకుడు బాగా తగ్గించేశాయి. దానికి తగ్గట్టే రేట్లు కూడా డౌన్ అయ్యాయి.