‘ట్రబుల్’ గాయాలు మానుతాయా?

తెలుగులో నేరుగా సినిమా చేయడానికి ముందే మన దగ్గర మంచి ఫాలోయింగ్ సంపాదించిన మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్. అతను నటించిన మలయాళ సినిమాలను థియేటర్లలో, ఓటీటీల్లో చూసి తనకు ఇక్కడ పెద్ద ఎత్తున ఫ్యాన్స్ తయారయ్యారు. ఆ తర్వాత ‘పుష్ప’ సినిమాలో విలన్ పాత్ర చేయడంతో తన ఫాలోయింగ్ ఇంకో లెవెల్‌కు చేరింది. మలయాళంలో అయినా, ఇతర భాషల్లో అయినా చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేసే అతను.. తెలుగులో హీరోగా అరంగేట్రం చేసిన ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ సినిమా మీద ఇక్కడి ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

ఈ చిత్రాన్ని చంద్రశేఖర్ యేలేటి శిష్యుడు శశాంక్ యేలేటి రూపొందించడం.. రాజమౌళి తనయుడు కార్తికేయ, బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ప్రొడ్యూస్ చేయడం.. రాజమౌళి కుటుంబమంతా ఈ సినిమాను ప్రమోట్ చేయడంతో సినిమాకు మంచి హైపే వచ్చింది. కానీ గత నెలలో మంచి అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం తుస్సుమనిపించేసింది. రాజమౌళి అండ్ ఫ్యామిలీ ఇంతగా ప్రమోట్ చేసింది ఈ సినిమానా అంటూ అందరూ నిట్టూర్చారు. ఇది నిర్మాత కార్తికేయ పెద్ద డ్యామేజే చేసింది.

ఐతే ఇప్పుడు కార్తికేయ.. మళ్లీ ఫాహద్ ఫాజిల్‌తో జట్టు కడుతుండడం విశేషం. 90, సత్యం సుందరం లాంటి క్లాసిక్స్ తీసిన ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో ఫాహద్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రేమ్ కుమార్ తొలి రెండు చిత్రాలకు సంగీతం అందించిన గోవింద్ వసంతే ఈ చిత్రానికి కూడా పని చేస్తున్నాడు. ఈ కాంబినేషన్ తమిళంతో పాటు ఇతర భాషల ప్రేక్షకుల్లోనూ అమితాసక్తిని రేకెత్తించేదే.

తెలుగులో ఈ మూవీని రిలీజ్ చేయబోయేది కార్తికేయనే కావడం విశేషం. ఒక పెద్ద ఫెయిల్యూర్ తర్వాత మళ్లీ అదే హీరో సినిమాను రిలీజ్‌కు తీసుకోవడం కొంత ఆశ్చర్యం కలిగించేదే. ఈ సినిమాను ప్రమోట్ చేసేటపుడు ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ గురించి మాట్లాడాల్సి వస్తే ఇబ్బంది అవుతుంది. ఆ సినిమాకు అంత హంగామా చేశాక మళ్లీ ఈ సినిమా గురించి గొప్పగా మాట్లాడ్డంలోనూ ఇబ్బంది ఉంటుంది. అయినా కార్తికేయ ధైర్యం చేస్తున్నాడు. కాకపోతే ప్రేమ్ కుమార్‌ మరోసారి గొప్ప సినిమానే తీసి ఉంటాడనే ఆశలుంటాయి కాబట్టి కార్తికేయ ధైర్యం చేస్తుండొచ్చు. మరి ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ గాయాలను ఇది ఎంతమేర మాన్పుతుందో చూడాలి.