ఈ మధ్యే ‘బంగారు బుల్లోడు’ సినిమాతో పలకరించాడు అల్లరి నరేష్. కానీ అతడి ఫ్లాప్ స్ట్రీక్‌ను కంటిన్యూ చేస్తూ ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర తేలిపోయింది. వీకెండ్లో కూడా కనీస ప్రభావం చూపలేక పోయిందీ చిత్రం. నిజానికి ఈ సినిమాపై నరేష్‌కు సైతం పెద్దగా ఆశల్లేనట్లే ఉంది. అతడి దృష్టంతా ‘నాంది’ చిత్రం మీదే ఉంది. చాలా ఏళ్ల తర్వాత ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి, ఇదేదో కొత్తగా ఉందే అనిపించిన నరేష్ సినిమా ఇది.
తన శైలికి భిన్నంగా నరేష్ ఇందులో సీరియస్ రోల్ చేశాడు. చేయని నేరానికి శిక్ష పడ్డ ఓ ఖైదీ.. తాను బయటికి రావడానికి చేసిన పోరాటం నేపథ్యంలో నడిచే కథ ఇది. విజయ్ కుమార్ కనకమేడల అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. గత ఏడాదే ఓటీటీలో ఈ సినిమా విడుదలవుతుందని ప్రచారం జరిగింది. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఐతే ఈ సినిమా విడుదలకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.
‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాను హోల్‌సేల్‌గా కొనేసిన జీ స్టూడియోస్ వాళ్లే ‘నాంది’ని కూడా కొన్నారట. రూ.8.5 కోట్లకు డీల్ క్లోజ్ అయినట్లు సమాచారం. త్వరలోనే అగ్రిమెంట్ పూర్తవుతుందని.. రిలీజ్ డేట్ ఇస్తారని సమాచారం. ఈ డీల్‌లో థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్ హక్కులు కలిపి ఉంటాయి. ‘సోలో బ్రతుకే సో బెటర్’ తరహాలోనే ముందు థియేటర్లలో సినిమాను రిలీజ్ చేసి.. మరి కొన్ని రోజులకు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వదులుతారు.
ఆపై జీ తెలుగులో సినిమాకు ప్రిమియర్స్ వేసుకుంటారు. ఇకపై ‘జీ’ వాళ్లు ఇదే ఒరవడిని కొనసాగించబోతున్నారని.. సినిమాలను హోల్‌సేల్‌గా కొనబోతున్నారని సమాచారం. ‘నాంది’ మీద ఉన్న అంచనాల ప్రకారం థియేటర్లలో రిలీజ్ చేసినా ఈ సినిమాకు మంచి ఫలితమే వచ్చే అవకాశముంది. కొంత రెవెన్యూ రాబట్టుకున్నాక ఓటీటీలో రిలీజ్ చేస్తే అక్కడా మంచి ఫలితం అందుకోవచ్చు.