చాలా కాలంగా నిర్మాణంలో వున్న ‘ఆర్.ఆర్.ఆర్.’ రిలీజ్ డేట్ ప్రకటించగా అందులో నటిస్తోన్న ఎన్టీఆర్, చరణ్ ఫాన్స్ కూడా పూర్తి సంతోషంగా లేరు. ఎందుకంటే ఈ చిత్రం విడుదలకు ఎంచుకున్న డేట్ పట్ల మిశ్రమ స్పందన వస్తోంది. దసరాకు రెండు రోజుల ముందు విడుదల చేయడం పాన్ ఇండియా మార్కెట్ పరంగా బెస్ట్ ఆప్షన్ అని రాజమౌళి భావించినట్టున్నాడు. అయితే దసరా విడుదల తెలుగు సినిమాలకు పెద్దగా కలిసి వచ్చిన దాఖలాలు లేవు. సంక్రాంతికి వుండే ఓవర్‍ఫ్లోస్ కానీ, లాంగ్ రన్ కానీ దసరా సినిమాలకు చాలా అరుదు. అందుకే కరోనా రాకముందు దసరా విడుదలకు రాజమౌళి సన్నాహాలు చేస్తోంటే ట్రేడ్ పట్టుబట్టి సంక్రాంతికి మార్పించారు.
కానీ కరోనా కారణంగా అన్ని ప్లాన్స్ దెబ్బ తినడంతో వచ్చే ఏడాది వరకు ఆగలేక అక్టోబర్ 13న ఆర్.ఆర్.ఆర్. విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే కనీసం దసరా సెలవులు మొదలవడానికి ముందు, అంటే అక్టోబర్ 8న ఈ చిత్రం విడుదల చేస్తే మంచిదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కాని పక్షంలో ఎలాగో ఆలస్యమయింది కనుక మరో రెండు నెలలు ఆగి సంక్రాంతికే విడుదల చేయాలని కోరుతున్నారు. ట్రేడ్‍తో సంప్రదింపులు జరపకుండా రాజమౌళి ఈ డెసిషన్ తీసుకోవడంతో చర్చలయితే ముమ్మరంగానే జరుగుతున్నాయని సమాచారం. మరి అందుకు అనుగుణంగా మరోసారి ఈ సినిమా రిలీజ్ డేట్ మారుతుందా లేక రాజమౌళి సినిమాకు సీజన్‍తో పనేంటని అనుకుంటారా అనేది వేచి చూద్దాం.