నగరాలు, పట్టణాల్లో రోడ్ల మీద ప్రయాణం చేస్తుంటే.. పక్కన మైక్ సెట్ పెట్టుకుని చక్కగా పాటలు పాడుతూ అంధులు దర్శనమివ్వడం మామూలే. ఇండియాలో ఎక్కడ చూసినా ఇలాంటివాళ్లు కనిపిస్తుంటారు. అందులో కొందరికి ఎంతో శ్రావ్యమైన గొంతు ఉంటుంది. చాలావరకు క్లాసిక్ సాంగ్స్ పాడి. మెచ్చిన జనం నుంచి డబ్బులు తీసుకుంటుంటారు. వారి మీద చాలామంది జాలితో స్పందిస్తుంటారు.
ఇలా రోడ్డు మీద పాట పాడే ఒక టాలెంటెడ్ బ్లైండ్ సింగర్ ప్రతిభ ఇప్పుడు సౌత్ ఇండియన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి.ప్రకాష్ కుమార్ దృష్టికి రావడం విశేషం. నార్త్ ఇండియాలో తన భార్య, బిడ్డలను పక్కన పెట్టుకుని చక్కగా హిందీ పాటలు పాడుతున్న ఒక అంధ గాయకుడి వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పెట్టారు.
అందరూ ఆ వీడియో చూసి బ్లైండ్ అయినప్పటికీ ఎంత బాగా పడుతున్నాడో అని కామెంట్లు పెట్టారు. ఈ పోస్ట్ ఎలాగో ప్రకాష్ వరకు చేరింది. దానిపై ఈ సంగీత దర్శకుడు స్పందించాడు. నిజంగా తనది గొప్ప ప్రతిభ అని, తన కాంటాక్ట్ నెంబర్ దొరికితే ఇవ్వాలని కోరాడు జి.వి. మరి ఎవరైనా ఆ బ్లైండ్ సింగర్ ఫోన్ నెంబర్ ఈ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ కి ఇస్తే తన సినిమాలో పాటలు పాడే అవకాశం ఇస్తాడేమో. అదే జరిగితే ప్రతిభను ప్రపంచానికి పరిచయం చెయ్యడంలో సోషల్ మీడియా పవర్ ఏంటో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుంది.
ఒకవైపు నటుడిగా వరుసగా సినిమాలు చేస్తూనే.. సంగీత దర్శకుడిగా దూసుకెళ్తున్నాడు రెహమాన్ మేనల్లుడు. ఈ ఏడాది తన నుంచి విశ్వనాథ్ అండ్ సన్స్, ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ వచ్చాయి. ఈ సినిమాల విజయంలో ప్రకాష్ పాత్ర ఎంతో కీలకం అనడంలో సందేహం లేదు. తమిళ సూపర్ హిట్ మండాడికి కూడా ప్రకాష్ స్కోర్ పెద్ద ప్లస్ అయింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates