గాడ్జిల్లా గండం తప్పిపోయింది

ఎన్నిసార్లు వచ్చినా ఎన్ని భాషల్లో తీసినా గాడ్జిల్లా మీద ప్రేక్షకుల అభిమానం చాలా స్పెషల్. మూడేళ్ళ క్రితం పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన గాడ్జిల్లా మైనస్ వన్ ఎంత సెన్సేషన్ సృష్టించిందో తెలిసిందే. కేవలం వంద కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ జపాన్ దేశపు విజువల్ వండర్ ని ప్రపంచం మొత్తం అబ్బురపడి చూసింది. ఆస్కార్ సైతం స్వాగతించింది. అందుకే దీని సీక్వెల్ గాడ్జిల్లా మైనస్ జీరో మీద విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేటర్ రిలీజ్ రేపు జరగనుంది.

ఇప్పటికే ప్రీమియర్లు చూసినవాళ్లు గాడ్జిల్లా మైనస్ జీరోని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. అయితే మన దేశంలో ఇది ఇప్పుడే రావడం లేదు. నవంబర్ 20 ఇండియాకి వస్తుందని ముంబై టాక్. ఇది ఒక రకంగా పెద్ద గండం తప్పించినట్టేనని చెప్పాలి. ఎందుకంటే రామాయణ లాంటి ఎపిక్ మూవీ రిలీజ్ ఉన్న టైంలో గాడ్జిల్లా కాంపిటీషన్ లో ఉంటే పిల్లలు, యువత దృష్టి దాని మీద ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా సోలోగా రావడం రన్బీర్ కపూర్ మూవీకి చాలా ప్లస్ అవుతోంది.

ఇదొక్కటే కాదు సూర్య సీన్, నయనతార మహాశక్తితో పాటు రెండో వారం రన్నింగ్ లో ఆదర్శ కుటుంబం ఏకె 47, థియేటర్ రన్ కొనసాగుతున్న జైలర్ 2 లాంటి వాటికీ ఈ బెనిఫిట్ దక్కనుంది. గాడ్జిల్లా గురించి మరీ అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఉందా అంటే, ఇప్పుడున్న పరిస్థితిలో ఇలాంటి మాన్స్టర్ మూవీస్ ని ఎంత మాత్రం తక్కువంచనా వేయడానికి లేదు. కొన్ని సార్లు అవెంజర్స్, అవతార్ లాంటివి మన సినిమాలను దెబ్బ తీసిన దాఖలాలున్నాయి.

గాడ్జిల్లా ఇండియా రిలీజ్ ఆలస్యానికి ప్రధాన కారణంగా ఐమాక్స్ స్క్రీన్లు తగినన్ని లేకపోవడమేనని బాలీవుడ్ టాక్. అన్నీ రామాయణకు కేటాయించడంతో నిర్మాణ సంస్థ పోస్ట్ పోన్ నిర్ణయం తీసుకుందట. రివ్యూలు చాలా పాజిటివ్ గా వస్తున్న నేపథ్యంలో మన దగ్గర ఎంత ఆలస్యమైనా మంచి ఓపెనింగ్స్ వచ్చేలా ఉన్నాయి, కాకపోతే పైరసీ ఎఫెక్ట్ లేకుండా ఎలా చూసుకుంటారో మరి. హైదరాబాద్ లో త్వరలోనే ఐమాక్స్ స్క్రీన్లు రాబోతున్న సంగతి తెలిసిందే. వారణాసి టైంకాంతా అందుబాటులోకి రావొచ్చు.