చిరు లిస్టులోకి ఇంకో పేరు

70 ఏళ్లు పైబడ్డా సరే, ఈ వయసులోనూ మెగాస్టార్ చిరంజీవి చాలా ఉత్సాహంగా సినిమాలు చేస్తున్నారు. ఈ తరం దర్శకులతోనూ పని చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ‘కాకా’ తర్వాత ఆయన శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేయాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల అది క్యాన్సిల్ అయినట్లే కనిపిస్తోంది. అలా అని మళ్లీ రెగ్యులర్ కమర్షియల్ డైరెక్టర్ల వైపేమీ చూడట్లేదు చిరు. న్యూ ఏజ్ డైరెక్టర్లతోనే జట్టు కట్టాలని చూస్తున్నారు.

ఆల్రెడీ తమిళ యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్‌ చెప్పిన కథను చిరు విన్నారని వెల్లడైంది. మెగాస్టార్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు కార్తీక్ సుబ్బరాజ్‌ ఇటీవల ఒక పాడ్ కాస్ట్‌లో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఐతే చిరు ఇప్పుడు ఇంకో ఎగ్జైటింగ్ యంగ్ డైరెక్టర్‌తో సంప్రదింపులు జరుపుతున్న విషయం వెల్లడైంది. అతనే.. తరుణ్ మూర్తి.

గత ఏడాది మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌తో ‘తుడరుమ్’ సినిమా తీసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు తరుణ్ మూర్తి. ఒక మధ్య తరగతి తండ్రి పాత్రలో మోహన్ లాల్‌ను సింపుల్‌గా చూపిస్తూనే హీరోయిజాన్ని అద్భుతంగా పండించాడు తరుణ్ మూర్తి. కథా బలానికి స్టార్ పవర్ కూడా తోడవడంతో ఈ సినిమా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని రీజనల్ ఇండస్ట్రీ హిట్ అయింది. ఆ సినిమా చూసినపుడు చిరును ఇలాంటి పాత్రలో చూడాలని మెగా అభిమానుల్లో ఒక వర్గం ఆశపడింది.

అందుకు తగ్గట్లే ఇప్పుడు తరుణ్ మూర్తి.. చిరుకు కథ చెప్పినట్లుగా, దానికి చిరు సానుకూలంగా స్పందించినట్టు వార్త బయటికి వచ్చింది. గతంలోనే వీరి కలయిక జరిగినప్పటికీ ఇప్పుడు చిరు నుండి సానుకూల నిర్ణయం వెలువడినట్టు వార్తలు వస్తున్నాయి. మరి మెగాస్టార్ నిర్ణయం ఏంటో చూడాలి. చిరు ఎవరితో తన తర్వాతి సినిమాను ఫైనలైజ్ చేస్తాడో కానీ.. ఆయన న్యూ ఏజ్ డైరెక్టర్లతో జట్టు కట్టడానికి ఆసక్తి చూపిస్తుండడం, కథలు వింటుండడం మాత్రం మంచి పరిణామమే.

తనలో ఉన్న గొప్ప నటుడిని లోపలే దాచేస్తున్నాడని.. ఒక ఛట్రంలో ఉంటూ కమర్షియల్ సినిమాలే చేస్తున్నాడని అభిమానుల్లో ఒక వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తుంటుంది. వయసుకు తగ్గ, వైవిధ్యమైన పాత్రలు.. కథాబలం ఉన్న సినిమాలు చేయాలని కోరుకుంటోంది ఈ వర్గం. చిరు ఇప్పుడు ఆ ప్రయత్నంలోనే ఉన్నట్లు కనిపిస్తోంది.