ఎన్టీఆర్ కోసం అనిల్ రూటు మారుస్తారా?

గత కొన్నేళ్లుగా ఎన్టీఆర్ నుంచి ఒక కొత్త సినిమా థియేటర్లలోకి రావాలంటే అభిమానులు ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ‘దేవర’, ‘వార్ 2’, ఇప్పుడు డ్రాగన్ ప్రాజెక్ట్ అన్నీ భారీ బడ్జెట్, లాంగ్ షెడ్యూల్స్ తో సాగుతున్న సినిమాలే. ఈ హైవోల్టేజ్ యాక్షన్ సైకిల్ కు బ్రేక్ ఇస్తూ ఎన్టీఆర్, అనిల్ రావిపూడి కాంబినేషన్ సెట్ అవ్వడం బిగ్ ట్విస్ట్.

నిజానికి ఈ క్రేజీ ప్రాజెక్ట్ వెనుక కళ్యాణ్ రామ్ ప్లానింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వెంకటేశ్, కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తున్న ‘జనవరి 12 విడుదల’ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో అనిల్ దగ్గర ఉన్న కథ విని ఎన్టీఆర్ కు సజెస్ట్ చేశారట. ఇక తక్కువ టైమ్ లోనే ఎన్టీఆర్ బ్యానర్ పై తమ్ముడితో సినిమాను లాక్ చేసినట్లు ఇండస్ట్రీ టాక్.

ప్రస్తుతం టాలీవుడ్ లో పక్కా ప్రీ-ప్లానింగ్ తో వేగంగా సినిమాలు తీసే దర్శకుల్లో అనిల్ రావిపూడి టాప్. బౌండ్ స్క్రిప్ట్ తో సెట్స్ పైకి వెళ్లే ఆయన, ‘ఎఫ్2’ ను 74 రోజుల్లో, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని కేవలం 72 రోజుల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్టించారు. చిరంజీవితో చేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ విషయంలోనూ కాల్షీట్లు వృథా చేయకుండా అనుకున్న టైమ్ కే షూటింగ్ ముగించారు.

మరోవైపు ఎన్టీఆర్ కూడా సెట్ లో అడుగుపెడితే బుల్లెట్ వేగంతో పనిచేసే నటుడు. పేజీల కొద్దీ డైలాగ్స్ ఉన్నా సింగిల్ టేక్ లో ఓకే చేయడం ఆయనకు అలవాటు. పాన్ ఇండియా హడావుడి కంటే ముందు ‘జై లవకుశ’, ‘అరవింద సమేత’ లాంటి సినిమాలను ఎన్టీఆర్ చాలా తక్కువ రోజుల్లోనే పూర్తి చేశారు. ఇప్పుడు అనిల్ స్పీడ్ కు ఎన్టీఆర్ టైమింగ్ తోడైతే, రెండు మూడు నెలల్లోనే సినిమా రెడీ అయినా ఆశ్చర్యం లేదు.

అయితే ఈ ప్రాజెక్ట్ ముందున్న అసలు సవాల్ పాన్ ఇండియా బ్యాలెన్స్. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ కు హిందీ మార్కెట్ లోనూ గట్టి పట్టు దొరికింది. ఇప్పటివరకు తెలుగు నేటివిటీ, ఫ్యామిలీ కామెడీ మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టిన అనిల్, ఈసారి ఎన్టీఆర్ ఇమేజ్ కు తగ్గట్టు యాక్షన్ స్కేల్ పెంచి షెడ్యూల్స్ పొడిగిస్తారా, లేక తన మార్క్ ఎంటర్ టైనర్ రూట్ లోనే ఫాస్ట్ గా చుట్టేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ లో ఉండగా, అనిల్ ‘జనవరి 12 విడుదల’ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయిన వెంటనే వీరి కాంబో సెట్స్ పైకి వెళ్లనుంది. కథ, షూటింగ్ డేట్స్ ఇంకా బయటకు రాకపోయినా, భారీ యాక్షన్ చిత్రాల మధ్య ఎన్టీఆర్ నుంచి ఒక ఫ్రెష్ ఎంటర్ టైనర్ చూసే ఛాన్స్ దక్కుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.