తండ్రిపై కొడుకు విజ‌యం

ఒక సూప‌ర్ స్టార్ కొడుకు సినిమాల్లోకి వ‌చ్చాడంటే.. తండ్రి పేరును వీలైనంత‌గా వాడుకోవ‌డానికే ప్ర‌య‌త్నిస్తాడు. న‌ట‌న‌లో తండ్రిని అనుక‌రించ‌డం.. త‌న సినిమాల్లో ఫాద‌ర్ రెఫ‌రెన్సులు పెట్ట‌డం.. త‌న సినిమాల ఈవెంట్ల‌కు తండ్రిని పిల‌వడం లాంటివి అన్ని ఇండ‌స్ట్రీల్లోనూ చూస్తుంటాం. ఇందులో త‌ప్పుబ‌ట్ట‌డానికి కూడా ఏమీ లేదు. అభిమానులు ఇలాంటివి ఆశిస్తారు, ఎంజాయ్ చేస్తారు కూడా. కానీ దుల్క‌ర్ స‌ల్మాన్ మాత్రం ఈ బాట‌లో సాగ‌లేదు. మొద‌ట్నుంచి త‌న రూటే సెప‌రేటు అన్న‌ట్లు సాగిపోయాడు. 

అత‌ను మ‌మ్ముట్టి కొడుకు అనే విష‌య‌మే గుర్తు రాన‌ట్లుగా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. కెరీర్ ఆరంభం నుంచి డిఫ‌రెంట్ సినిమాల‌తో సాగిపోతూ.. వివిధ భాష‌ల్లో మంచి గుర్తింపు సంపాదించాడు దుల్క‌ర్. అత‌డికి తెలుగులో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగే వేరు. మ‌హాన‌టి, సీతారామం, ల‌క్కీ భాస్క‌ర్ లాంటి క‌ల్ట్ మూవీస్ అందించిన అత‌ను లేటెస్ట్‌గా ఆకాశంలో ఒక తార రూపంలో మ‌రో క్లాసిక్ చేశాడు. ఈ సినిమాకు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది.

కొంచెం నెమ్మ‌దిగా మొద‌లైన‌ప్ప‌టికీ.. క్ర‌మంగా బాగానే పుంజుకుంటోంది ఆకాశంలో ఒక తార‌. ఫుల్ ర‌న్ అయ్యేస‌రికి ఈ చిత్రం సూప‌ర్ హిట్ రేంజికి వెళ్తుంద‌నే అంచ‌నా వేస్తున్నారు. ఈ చిత్రం క్లాసిక్ స్టేట‌స్ అందుకుంటుంద‌ని, చాలా అవార్డులు కూడా సాధిస్తుంద‌ని భావిస్తున్నారు.

విశేషం ఏంటంటే.. ఈ సినిమా రిలీజైన న‌వంబ‌రు 20నే దుల్క‌ర్ తండ్రి మ‌మ్ముట్టి కీల‌క పాత్ర పోషించిన త‌మిళ చిత్రం ఓం కూడా విడుద‌లైంది. తెలుగులో ఈ చిత్రానికి పెద్ద రిలీజే ద‌క్కింది. తొలి రోజు మంచి ఓపెనింగ్స్ వ‌చ్చాయి కూడా. కానీ ఓంకు అంత‌టా నెగెటివ్ రివ్యూలే వ‌చ్చాయి. కాంబినేష‌న్ క్రేజ్ వ‌ల్ల ఓపెనింగ్స్ వ‌చ్చి ఉండొచ్చు కానీ.. సినిమా నిల‌బ‌డే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు.

ఇందులో మమ్ముట్టి బాగానే న‌టించినా.. ఆయ‌న పాత్ర‌ను మ‌రీ డంబ్‌గా తీర్చిదిద్దారంటూ తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మ‌మ్ముట్టి స్థాయి న‌టుడు చేయాల్సిన పాత్ర కాద‌ని అంటున్నారు. ఓం అంతిమంగా బాక్సాఫీస్ ఫెయిల్యూర్ కావ‌డ‌మే కాదు, మ‌మ్ముట్టి మ‌రిచిపోవాల్సిన పాత్ర‌ల్లో ఒక‌ట‌య్యేలా ఉంది. కొడుక్కి అంత అప్రిషియేన్ వ‌స్తున్న టైంలో అత‌డితో పోటీప‌డ్డ‌ మ‌మ్ముట్టికి ఇలాంటి పేల‌వ‌మైన‌ పాత్ర ప‌డ‌డం విచిత్రం. మొత్తానికి దుల్క‌ర్ ఈ వీకెండ్ వ‌ర‌కు తండ్రిని మించిన కొడుకు అనిపించుకుంటున్నాడ‌న్న‌మాట‌.