తమన్ స్టేట్‌మెంట్‌లో ఇంత అతిశయమా

తమకు ఇష్టమైన దర్శకులను పొగుడుకోవడంలో సెలబ్రిటీలు అనుసరించే పద్ధతులు, వాడే పదాలు వేర్వేరుగా ఉంటాయి. ఒక్కోసారి ఇవి అతిశయోక్తిగా మారి వినేవాళ్లకు ఇబ్బందిగా కూడా అనిపిస్తాయి. ఆదర్శ కుటుంబం ఏకె 47 సక్సెస్ ప్రెస్ మీట్ లో తమన్ మాట్లాడుతూ త్రివిక్రమ్ రామాయణం తీస్తే చూడాలని ఉందని, ఒకవేళ నిజంగా జరిగితే అది మాయాబజార్ అంత గొప్ప సినిమాగా మారి 365 రోజులు ఆడుతుందని పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఇది విన్న అక్కడున్న వాళ్ళు ఆశ్చర్యపోయారు.

త్రివిక్రమే కాదు రామాయణం ఎవరైనా తీయొచ్చు. ఇప్పటికీ తీస్తూనే ఉన్నారు. ఎన్టీఆర్ లవకుశ నుంచి రన్బీర్ రామాయణ దాకా కొన్ని వేలల్లో సీరియల్స్ సినిమాలు ఉన్నాయి. ఆదిపురుష్ లాంటివి దారుణంగా బోల్తా కొడితే, సంపూర్ణ రామాయణం లాంటివి చరిత్ర సృష్టించాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇలాంటి సబ్జెక్టు తీసుకుంటే చాలా బాగుంటుంది. అందులో అనుమానం లేదు. కానీ ఏకంగా మాయాబజార్ తో పోలికంటే మటుకు క్లాసిక్ లవర్స్ అంత పాజిటివ్ గా తీసుకోకపోవచ్చు.

ఎందుకంటే టాలీవుడ్ చరిత్రలో మాయాబజార్ ది ప్రత్యేక స్థానం. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్విఆర్, గుమ్మడి, సూర్యకాంతం, రమణారెడ్డి, రేలంగి లాంటి ఎందరో లెజెండ్స్ ప్రాణం పోసిన మాస్టర్ పీస్ అది. పాండవులు లేకుండా వాళ్ళు ఉన్నారనే భ్రమ కల్పించి మూడు గంటల స్క్రీన్ ప్లే నడిపించడం చాలా గొప్ప విషయం. అలాంటి మేజిక్ దాని దర్శకుడు కెవి రెడ్డినే మళ్ళీ పునఃసృష్టి చేయలేకపోయారు. ఇంకెవరివల్లా కాలేదు. అంతటి కళాఖండంతో పోలిక అంత సమంజసం కాదు.

పైగా త్రివిక్రమ్ ఒకప్పటి మేజిక్ టచ్ ఇంకా పూర్తి స్థాయిలో బయటికి రావడం లేదు. గుంటూరు కారం, ఆదర్శ కుటుంబం కమర్షియల్ గా వసూళ్లు తేవొచ్చేమో కానీ ఆయన రేంజ్ లో సాలిడ్ కంటెంట్ పడాలని మూవీ లవర్స్ బలంగా కోరుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోఏ గాడ్ అఫ్ వార్ (ప్రచారంలో ఉన్న టైటిల్) తో ప్యాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాల్సిన బాధ్యత త్రివిక్రమ్ మీద ఉంది. అది నెరవేరాక రామాయణం, మహాభారతం లాంటివి ట్రై చేయొచ్చు.