ఆదర్శ కుటుంబం టార్గెట్ పెద్దదే

త్రివిక్రమ్ రచనలో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి కల్ట్ మూవీస్ చేశాడు విక్టరీ వెంకటేష్. ఐతే మాటల మాంత్రికుడి దర్శకత్వంలో వెంకీ సినిమా చేస్తే చూడాలని ఎన్నో ఏళ్ల నుంచి వీళ్లిద్దరి అభిమానులు కోరుకుంటున్నారు. అనుకోని కారణాలతో వాయిదా పడి.. చివరికి గత ఏడాది ఈ సినిమా పట్టాలెక్కింది.

షూటింగ్ ఆలస్యమై, విడుదల పలుమార్లు వాయిదాపడి.. ఎట్టకేలకు శుక్రవారం వీరి సినిమా ‘ఆదర్శ కుటుంబం’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ క్రేజీ కాంబో మూవీకి బిజినెస్ కొంచెం గట్టిగానే జరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ కొంచెం పెద్దదే. వరల్డ్ వైడ్ రూ.70 కోట్ల షేర్ రాబడితే కానీ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వదట.

‘ఆదర్శ కుటుంబం’ రైట్స్ అత్యధిక రేటు పలికింది నైజాం ఏరియాలో. అక్కడ రూ.20 కోట్లకు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ హక్కులు కొన్నట్లు సమాచారం. రాయలసీమ హక్కులు రూ.8 కోట్లకు అమ్మారట. ఏపీలో మిగతా ఏరియాలన్నీ కలిపి రూ.20 కోట్ల మేర బిజినెస్ చేసింది ‘ఆదర్శ కుటుంబం’. ఇక వెంకీ, త్రివిక్రమ్ ఇద్దరికీ యుఎస్‌లో మంచి మార్కెట్ ఉన్న నేపథ్యంలో అక్కడ రూ.12 కోట్లకు రైట్స్ అమ్మారట. మిగతా ఏరియాలన్నీ కలిపి రూ.10 కోట్ల మేర బిజినెస్ చేసినట్లు అంచనా. ఇలా మొత్తం రూ.70 కోట్లకు థియేట్రికల్ హక్కులు అమ్ముడయ్యాయి.

అంటే ఈ సినిమా రూ.150 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేస్తేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ప్రి రిలీజ్ హైప్ చూస్తే మాత్రం టార్గెట్ అందుకోవడం అంత తేలిక కాదనిపిస్తోంది. ఐతే ఇది పక్కా ఫ్యామిలీ మూవీ కావడంతో ఒక మోస్తరు టాక్ వచ్చినా జనం థియేటర్లకు క్యూ కట్టేస్తారని.. సినిమాకు దీపావళి సీజన్ అయ్యేవరకు లాంగ్ రన్ ఉంటుందని.. బయ్యర్లు సేఫ్ అయిపోతారని మేకర్స్ భావిస్తున్నారు. వెంకీ సరసన శ్రీనిధి శెట్టి నటించిన ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ప్రొడ్యూస్ చేసింది. తమన్ సంగీతం అందించాడు.