ఇండియన్-3 ఫ్రీగా చేస్తున్నట్లేనా?

‘ఇండియన్’ లాంటి ఆల్ టైం కల్ట్ బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ తీసి గట్టిగానే తల బొప్పి కట్టించుకున్నారు శంకర్, కమల్ హాసన్. ఏ ముహూర్తాన ఈ సినిమాను మొదలుపెట్టారో కానీ.. దీనికి ఏదీ కలిసి రాలేదు. షూటింగ్ సందర్భంగా ప్రమాదం జరిగిన క్రూ మెంబర్స్ ప్రాణాలు కోల్పోవడం.. సుదీర్ఘ కాలం షూటింగ్ ఆగిపోవడం.. తర్వాత సినిమా పూర్తయినప్పటికీ ఔట్ పుట్ ఘోరంగా రావడం.. సినిమా రిలీజయ్యాక దారుణమైన ఫలితాన్నందుకోవడం.. వందల కోట్ల నష్టం వాటిల్లడం.. ఇలా ‘ఇండియన్’ సీక్వెల్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు.

సీక్వెల్‌ను ఒక సినిమాగా తీసి ఉంటే కథ వేరుగా ఉండేదేమో. కానీ భారీ బడ్జెట్‌ను వర్కవుట్ చేయడం కోసం కథను సాగదీసి రెండు భాగాలు చేయడంతో అసలుకే మోసం వచ్చింది. ఇండియన్-2 డిజాస్టర్ అయింది. ఇండియన్-3 మరుగున పడిపోయింది. బ్యాలెన్స్ షూటింగ్ చేసి సినిమాను రిలీజ్ చేయలేక రెండేళ్లుగా వెయిటింగ్‌ మోడ్‌లో ఉండిపోయారు లైకా ప్రొడక్షన్స్ అధినేతలు.

ఐతే ఎట్టకేలకు ఇటీవలే ఈ సినిమా బ్యాలెన్స్ పార్ట్ షూట్‌కు ముహూర్తం కుదిరింది. శంకర్, కమల్ హాసన్ అందుబాటులోకి వచ్చి చిత్రీకరణను పున:ప్రారంభించారు. ఐతే ఆల్రెడీ ఈ ప్రాజెక్టు మీద వందల కోట్లు పోగొట్టుకున్న లైకా అధినేతలు.. బ్యాలెన్స్ రెమ్యూనరేషన్ ఇవ్వకుండానే కమల్, శంకర్‌లను సినిమాను పూర్తి చేయడానికి ఒప్పించారట. వాళ్లిద్దరూ సినిమా బిజినెస్, ఫలితాన్ని బట్టి తమ పారితోషకాలు తీసుకుంటారట. ఇందుకోసం వాళ్లు పెట్టిన కండిషన్.. ప్రొడక్షన్ విషయంలో ఏమాత్రం రాజీపడకూడదు, వీఎఫెక్స్ సహా అన్నింటినీ పర్ఫెక్ట్‌గా చేయాలని. అందుకు లైకా అధినేతలు అంగీకరించారు.

కాకపోతే ‘ఇండియన్-2’ అంత భారీ డిజాస్టర్ అయిన నేపథ్యంలో ‘ఇండియన్-3’ని ఎంత బాగా తీసినా సరే.. ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించడం, బయ్యర్లను ఆకర్షించడం అంత తేలిక కాదు. ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితం దక్కాలి, లాభాలు రావాలి అంటే అద్భుతాలు జరగాల్సిందే. ఆ అద్భుతాలు జరిగితే తప్ప శంకర్, కమల్‌లకు ‘ఇండియన్-3’ నుంచి పారితోషకాలు రావడం సందేహమే. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఇద్దరూ ఫ్రీగా సినిమా చేస్తున్నట్లే.