సంక్రాంతి సినిమాల లెక్క తేలిపోయింది. ఈ పండుగ తెలుగు సినీ పరిశ్రమకు కొత్త ఊపిరులూదింది. కరోనా భయం వెంటాడుతుండగా.. 50 శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లు నడుస్తుండగా అనేక సందేహాల మధ్య పండక్కి నాలుగు సినిమాలు రిలీజ్ చేశారు నిర్మాతలు. వాటిలో ఒక్కటి మినహాయిస్తే మూడు సినిమాలూ బ్రేక్ ఈవెన్ మార్కును దాటేశాయి. ఆ మూడు లాభాల బాటలో నడుస్తున్నాయి. ఆ మూడు చిత్రాలూ.. క్రాక్, మాస్టర్, రెడ్.
సంక్రాంతి రేసులో ముందుగా వచ్చి సోలోగా మూణ్నాలుగు రోజులు బాక్సాఫీస్‌ను దున్నుకున్న ‘క్రాక్’.. ఇప్పటికే రూ.25 కోట్ల షేర్ మార్కును దాటేసింది. రూ.30 కోట్ల షేర్ దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం బాక్సాఫీస్ లీడర్ ఆ సినిమానే. వీక్ డేస్‌లో కూడా ఈ చిత్రానికి మంచి వసూళ్లే వస్తున్నాయి. ఈ వారం ‘బంగారు బుల్లోడు’ వస్తున్నప్పటికీ బాక్సాఫీస్ ఆధిపత్యం క్రాక్‌దే అవుతుందని అంచనా వేస్తున్నారు.ఈ చిత్రం ఈజీగా రూ.30 కోట్ల షేర్ మార్కును అందుకునే అవకాశాలున్నాయి.
ఇక సంక్రాంతి సినిమాల్లో సెకండ్ బిగ్గెస్ట్ హిట్ అంటే.. తమిళ అనువాదం ‘మాస్టర్’యే. ఓవరాల్ వసూళ్లను కాకుండా పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే ఈ చిత్రం సూపర్ హిట్ రేంజిని అందుకున్నట్లే. విజయ్ కెరీర్లోనే తొలిసారిగా తెలుగులో రూ.10 కోట్ల షేర్ మార్కును టచ్ చేసిన సినిమా ఇది. ఈ చిత్రం ఇప్పటిదాకా రూ.12 కోట్ల దాకా షేర్ రాబట్టింది. తొలి రోజు భారీ స్థాయిలో స్క్రీన్లు, షోలు ఇవ్వడం ఈ సినిమాకు కలిసొచ్చింది. టాక్ డివైడ్‌గా ఉన్నప్పటికీ ఓపెనింగ్స్‌కు ఢోకా లేకపోయింది.
ఇక రామ్ సినిమా ‘రెడ్’ కూడా వీకెండ్ అయ్యేలోపు బ్రేక్ ఈవెన్ మార్కును టచ్ చేసింది. ఈ చిత్రం ఇప్పటిదాకా రూ.15 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. శాటిలైట్, డిజిటల్, డబ్బింగ్ హక్కులతోనే పెట్టుబడి వెనక్కి వచ్చేయడంతో ఈ సినిమాను తక్కువ రేట్లకు అమ్మాడు నిర్మాత స్రవంతి రవికిషోర్. టాక్ డివైడ్‌గానే ఉన్నప్పటికీ.. ఓపెనింగ్స్‌కు ఢోకా లేకపోవడంతో ఈ చిత్రం సేఫ్ అయిపోయింది. స్వల్ప లాభాలు కూడా బయ్యర్లు అందుకుంటున్నారు.
ఇక చివరి సంక్రాంతి సినిమా ‘అల్లుడు అదుర్స్’కు మాత్రం పండుగ కలిసి రాలేదు. కొంచెం పెద్ద స్థాయిలోనే రిలీజ్ చేయడం వల్ల తొలి వీకెండ్లో ఓపెనింగ్స్ పర్వాలేదు కానీ.. ఈ సినిమాలో విషయం లేకపోవడంతో సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు. వీకెండ్ తర్వాత సినిమా నిలవలేకపోయింది. సంక్రాంతి సినిమాల్లో అదొక్కటి మాత్రమే ఫ్లాప్ అని చెప్పాలి.