జబర్దస్త్ కామెడీ షోలో స్కిట్లు చూసి అందరూ నవ్వుకుంటారు కానీ.. అందులో కనిపించే వారి మీద ఒక రకమైన చిన్న చూపు ఉంటుంది. బూతుల మీద ఎక్కువ ఆధారపడతారని.. జోక్స్ చీప్గా ఉంటాయని.. సమాజం మీద చెడు ప్రభావం చూపించే షో ఇదని.. రకరకాల విమర్శలు వస్తుంటాయి. సినిమాల్లో కామెడీ క్రింజ్గా ఉంటే.. జబర్దస్త్ కామెడీ షోతో పోల్చి తక్కువ చేసే ప్రయత్నం కూడా సోషల్ మీడియాలో జరుగుతుంటుంది.
ఇలాంటి అభిప్రాయం ఉన్న షో నుంచి వచ్చిన ఒక మామూలు కమెడియన్.. ఇప్పుడు జనాలతో శభాష్ అనిపించుకుంటున్న వెబ్ సిరీస్ను డైరెక్ట్ చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఆ సిరీస్.. ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కాగా.. దీన్ని రూపొందించింది బాబు డేగల. ఈ పేరు విని గుర్తు పట్టడం కష్టం కానీ.. తన ఫొటో చూస్తే ఐడియా వస్తుంది.
ఎక్కువగా హైపర్ ఆది స్కిట్లలో కనిపించిన బాబు.. వేరే లీడర్ల స్కిట్లలోనూ సహాయ పాత్రలే పోషించాడు. అతడికి ఎక్కువగా డంబ్ క్యారెక్టర్లే ఇస్తుంటారు. అతను స్కిట్లోకి వచ్చాడంటే తన మీద వరుసబెట్టి పంచులు పడిపోతుంటాయి. దీని వల్ల ఆ ఇమేజ్ నిజ జీవితంలో కూడా క్యారీ అయిపోతుంటుంది. అందుకే బాబు అండ్ డంబ్ అనే ముద్ర పడిపోయింది. ఇలాంటి ఇమేజ్ ఉన్న వాడు.. ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ లాంటి సెన్సిబుల్ సిరీస్ తీయడం విశేషమే. ఇందులో కామెడీ బాగా పేలింది. ఎమోషన్లూ వర్కవుట్ అయ్యాయి. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్తో ఈ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
రిలీజ్ ముంగిట దీని గురించి సోషల్ మీడియాలో పెద్దగా చర్చ లేదు కానీ.. ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ మొదలయ్యాక ఇందులోని సన్నివేశాలు, డైలాగులు సోషల్ మీడియాలో వైరల్ అవడం మొదలుపెట్టాయి. జనం ఈ సిరీస్ను బాగానే చూస్తున్నారని సోషల్ మీడియాలో ట్రెండ్స్ చూస్తే అర్థమవుతోంది. జబర్దస్త్లో చిన్న కమెడియన్గా ఉన్న బాబు.. ఇలాంటి సిరీస్ తీయడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ‘డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్’ అనడానికి బాబునే ఉదాహరణ. సీజన్-1 హిట్టయిన నేపథ్యంలో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’కు అతను సీక్వెల్ కూడా తీయబోతుండడం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates