ఎక్కాల్సిన రైలు బాగా లేటయ్యింది

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగిపోవాలని పెద్దలు అంటారు. పెళ్లి, పిల్లలు ఏదైనా సరే ఏజ్ బార్ కాకూడదని దాని సారాంశం. సినిమాలకూ ఇది వర్తిస్తుంది. కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది బాలీవుడ్ లో నాలుగు వందల కోట్లకు పైగా వసూలు చేసిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హనుమాన్ అంశ్ తెలుగులో చాలా ఆలస్యంగా అక్టోబర్ 9 విడుదలయ్యింది. వాస్తవానికి గత నెలే ప్లాన్ చేసుకున్నప్పటికీ డిస్ట్రిబ్యూషన్ ఇష్యూస్ వల్ల మూడు వారాలు వాయిదా పడింది.

తీరా చూస్తే ఆ జాప్యమే శాపంగా మారినట్టు కనిపిస్తోంది. ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం మొదటి వీకెండ్ హనుమాన్ అంశ్ వసూలు చేసిన మొత్తం గ్రాస్ అయిదు కోట్లకు కొంచెం అటుఇటు ఉందట. ఆదివారం జనంతో థియేటర్లు నిండుగా కనిపిస్తాయనుకుంటే దానికి భిన్నంగా కొన్ని చోట్ల మాత్రమే ఫుల్స్ పడటం బయ్యర్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. దీనికి కామ్రేడ్ కళ్యాణ్ ఎంత మాత్రం కారణం కాదు. దానికీ యునానిమస్ టాక్ రాలేదు. కానీ కామెడీ ఫాక్టర్ తో జనాన్ని మూడు రోజులు లాగేసింది.

హిందీ వెర్షన్ రిలీజైన అరవై రోజుల తర్వాత హనుమాన్ అంశ్ డబ్బింగ్ తేవడం పొరపాటే. ఇదేదో ముందే చేసి ఉంటే కచ్చితంగా కలెక్షన్లు బాగుండేవి. ఏ సెంటర్స్ ఆడియన్స్ ఒరిజినల్ ని ఇంతకు ముందే చూశారు. బిసి కేంద్రాల్లో కరోలి బాబా గురించి అవగాహన ఉన్న వాళ్ళు తక్కువ కావడంతో దీని మీద అటెన్షన్ రాలేదు. ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ తప్ప ఎలాంటి ఈవెంట్ చేయకపోవడం ప్రమోషన్స్ పరంగా మైనస్ అయ్యింది. ఇవన్నీ కూడబలుక్కుని ఎఫెక్ట్ చూపించాయి.

తర్వాత పికప్ కు ఛాన్స్ ఉందా అంటే కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకో మూడు రోజుల్లో రజనీకాంత్ జైలర్ 2 వస్తుంది. ఆ వెంటనే విజయ్ దేవరకొండ రణబాలి రంగంలోకి దిగుతాడు. గరివిడి లక్ష్మిని గట్టిగా ప్రమోట్ చేసేందుకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. సో పబ్లిక్ అటెన్షన్ ఆటోమేటిక్ గా కొత్త రిలీజుల వైపు వెళ్తుంది. ఈ లెక్కన హనుమాన్ అంశ్ పెట్టుకున్న టార్గెట్ లో సగం అందుకోవడం కుడా అనుమానమే. ఓటిటి రిలీజ్ కూడా త్వరలోనే ఉండొచ్చని టాక్.