ఇంతకీ అలియాస్ రుక్మిణి ఎవరు?

ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని చాలా ఏళ్లుగా ఇదే పని చేస్తున్నాడు. అప్‌కమింగ్ హీరో విశ్వక్సేన్‌ను పెట్టి ‘హిట్’ తీశాడు. ఆపై అడివి శేష్‌తో ‘హిట్-2’ చేశాడు. ఇప్పుడేమో నితిన్ ప్రధాన పాత్రలో ‘అలియాస్ రుక్మిణి’ అనే సినిమా తీస్తున్నాడు. ‘దండోరా’తో మంచి పేరు సంపాదించిన మురళీకాంత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.

కొన్ని నెలల ముందే మొదలైన ఈ సినిమా.. చకచకా చిత్రీకరణ పూర్తి చేసుకుంటోంది. డిసెంబరు 4న ‘అలియాస్ రుక్మిణి’ని విడుదల చేయబోతున్నట్లు ఇటీవలే అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చేశారు. ఇంత వేగంగా సినిమా పూర్తయి ప్రేక్షకుల ముందుకు వస్తుండడం విశేషమే. ఐతే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అన్నది మాత్రం సస్పెన్సుగా ఉంది. రిలీజ్ డేట్ పోస్టర్లలో కూడా హీరోయిన్ పిక్టోగ్రామ్‌తో టీజ్ చేశారే తప్ప.. తనెవరన్నది వెల్లడించలేదు.

దీంతో ప్రేక్షకులు ఎవరా రుక్మిణి అంటూ గెస్సింగ్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. ఇక్కడ పాపులర్ అయిన హీరోయిన్లను ఆ పిక్టోగ్రామ్‌తో మ్యాచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవం ఏంటంటే.. ‘అలియాస్ రుక్మిణి’లో నటిస్తున్నది ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్ కాదు. ఆమె కొత్తమ్మాయి. తన పేరు.. ఆఫియా సయ్యద్. ఆమె బాలీవుడ్లో ఒక బడా ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. లెజెండరీ ప్రొడ్యూసర్ సాజిద్ నడియాడ్‌వాలా మేనకోడలే ఈ ఆఫియా అట. ఆమె ఇటీవలే ‘ప్రేమలు’ హిందీ రీమేక్ ‘ప్రేమ్ కీతను’తో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది.

బాలీవుడ్లో అంత పెద్ద ఫ్యామిలీకి చెందిన అమ్మాయి కెరీర్ ఆరంభంలోనే ఇలా తెలుగులోనూ డెబ్యూ చేయడం విశేషమే. మరి ఇక్కడ ఆమెకు ఎలాంటి అరంగేట్రం దక్కుతుందో? ఇంకా ఎక్కువ రోజులు సస్పెన్స్ కొనసాగించకుండా.. త్వరలోనే ఆమె ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయబోతున్నారు. ‘వృషకర్మ’ లాంటి క్రేజీ మూవీతో పోటీకి సై అంటున్న ‘అలియాస్ రుక్మిణి’ నాని, నితిన్‌లకు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.