రవితేజకు జోడీ ఎవరు?

మాస్ రాజా రవితేజ కొత్త సినిమా కబురు వచ్చేసింది. కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతున్నట్లే విలక్షణ దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేయబోతున్నారు. ఆ సినిమా టైటిల్ గురించి మీడియాలో జరిగిన ప్రచారం కూడా నిజమే అని తేలిపోయింది. ‘తులాభారం’ అనే పేరునే ఈ సినిమాకు ఖాయం చేశారు. ఈ టైటిల్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ డాక్యుమెంటరీ తీసి రిలీజ్ చేయగా.. దానికి మంచి స్పందన వచ్చింది.

కథకు తగ్గట్లే టైటిల్ పెట్టినట్లున్నారు. పైగా అది అచ్చ తెలుగు పేరు కావడంతో సర్వత్రా మంచి స్పందన వస్తోంది. ప్రియాంక మోహన్, అనస్వర రాజన్, జేడీ చక్రవర్తి, తరుణ్ భాస్కర్.. ఇలా మంచి కాస్టింగ్ కూడా సెట్ చేశాడు వివేక్ ఆత్రేయ. సినిమా కాన్సెప్ట్ గురించి చెప్పిన తీరు చూస్తే ఇది ‘బ్రోచేవారెవరురా’ లాంటి ఎంటర్టైనింగ్ క్రైమ్ థ్రిల్లర్ అవుతుందనిపిస్తోంది.

ఇవన్నీ పక్కన పెడితే.. ఈ సినిమాలో అనస్వర రాజన్ ఉండడం ఒకింత ఆశ్చర్యం కలిగించేదే. ముందు సోషల్ మీడియాలో ఈ విషయం బయటికి రాగా అది జస్ట్ రూమర్ అయి ఉంటుందనే చాలామంది అనుకున్నారు. ఎందుకంటే 58 ఏళ్ల రవితేజ పక్కన 24 ఏళ్ల అనస్వర కథానాయికగా ఏం బాగుంటుందనే.

అసలు అనస్వరను చూస్తే ఆమెకు 24 ఏళ్లు అన్నా కూడా ఎక్కువే అనిపిస్తుంది. రవితేజ విషయంలో ఎప్పట్నుంచో ఉన్న ఒక విమర్శ ఏంటంటే.. తన పక్కన వయసు అంతరం మరీ ఎక్కువ ఉన్న హీరోయిన్లను పెట్టుకుంటాడని. కొందరు యంగ్ హీరోయిన్లతో ఆయన రొమాన్స్ చేయడం మీద విమర్శలు కూడా వచ్చాయి.

వాళ్లందరికంటే అనస్వర మరీ చిన్నమ్మాయిగా కనిపిస్తుంది రవితేజ పక్కన. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి సీనియర్లు తమ వయసులో మూడో వంతున్న హీరోయిన్లతో ఆడి పాడినా చెల్లిపోయింది కానీ.. ఈ సోషల్ మీడియా కాలంలో వయసు అంతరం మరీ ఎక్కువ ఉంటే ట్రోల్స్ తప్పట్లేదు. కాబట్టి రవితేజకు అనస్వర జోడీ కాకుంటే బాగుంటుందని.. ఆమెది స్పెషల్ క్యారెక్టర్‌గా ఉంటే బెటర్ అని అభిప్రాయపడుతున్నారు. దర్శకుడిగా వివేక్ ఆత్రేయ అభిరుచి ఏంటో తెలిసిందే కాబట్టి.. అతను రవితేజ, అనస్వర మధ్య రొమాన్స్ లేకుండా చూసుకుంటాడని నమ్మొచ్చు.