రణబాలికి కాంతార రంగు

ఒక కొత్త సినిమా ప్రోమో రాగానే దాన్ని గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలతో పోల్చడం ఆడియన్స్ కు అలవాటే. ఇప్పుడు విజయ్ దేవరకొండ నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ రణబాలికి కూడా సరిగ్గా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన విజువల్స్ చూసిన జనాలు దీనికి కాంతార రంగు పూస్తున్నారు. ఫస్ట్ లుక్ నుంచి రీసెంట్ గా వచ్చిన అప్డేట్స్ వరకు ఆ డివైన్ ఫీల్ కనిపించడంతో ఈ పోలికలు తెరపైకి వచ్చాయి.

కరువు, పల్లెటూరి నేపథ్యం, హీరో మెడలో భారీ రుద్రాక్షలు.. ఇవన్నీ చూస్తుంటే రిషబ్ శెట్టి మార్క్ వాతావరణం గుర్తుకురావడం సహజం. గుహలోంచి హీరో పుట్టుకను బుర్రకథ రూపంలో చెప్పడం లాంటి జానపద ఛాయలు ఈ పోలికలకు మరింత బలం చేకూర్చాయి. ఇలాంటి మిస్టిక్ ఎలిమెంట్స్, దైవాంశ సంభూతుడిలాంటి హీరో క్యారెక్టరైజేషన్ ఉన్నప్పుడు జనాల మైండ్ లో కాంతార వైబ్స్ తిరగడం చాలా కామన్.

అయితే ఇక్కడే దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ట్రాక్ రికార్డ్ అలాంటిదే. టాక్సీవాలాలో హారర్, శ్యామ్ సింగ రాయ్ లో పునర్జన్మ కాన్సెప్ట్ లను అద్భుతంగా హ్యాండిల్ చేసిన మేకర్ తను. ఇప్పుడు బ్రిటిష్ కాలం నాటి పీరియాడిక్ కథకు ఒక ఫాంటసీ యాంగిల్ జోడించి సరికొత్త ప్రయోగానికి రెడీ అయ్యాడు. కాబట్టి ఇది కేవలం గ్రామ దేవతల కథ అని ముందే ఒక అంచనాకు రావద్దనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.

ప్రస్తుతం మేకర్స్ ముందున్న అతిపెద్ద సవాల్ ఈ కాంతార రంగును దాటడమే. ఎందుకంటే జనాలు అదే ఎక్స్ పీరియన్స్ ఆశించి థియేటర్లకు వస్తే, అసలు కథ పక్కదారి పట్టే రిస్క్ ఉంటుంది. రణబలి అనేది ఒక ఆల్టర్నేట్ హిస్టరీ యాక్షన్ డ్రామా అని, ఇది పూర్తిగా వేరే ప్రపంచం అని ఇదివరకే ఒక క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా ఆడియన్స్ కు ఆ డౌట్స్ వస్తున్నాయి.

కాబట్టి మేకర్స్ ముందే ఈ కంటెంట్ వేరని స్ట్రాంగ్ గా రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రేక్షకులు ఎలాంటి అంచనాలు లేకుండా సినిమాను ఎంజాయ్ చేస్తారు. నిజానికి కంటెంట్ లో దమ్ముంటే ఇలాంటి పోలికలను జనాలు పెద్దగా పట్టించుకోరు. సినిమా స్టార్ట్ అయిన కాసేపటికే ఆ కొత్త ప్రపంచంలోకి ఆడియన్స్ ను తీసుకెళ్లగలిగితే చాలు.

బ్యాక్ డ్రాప్ ఏమైనా కథలో ఎమోషన్ ఫ్రెష్ గా అనిపిస్తే ఆటోమేటిక్ గా పాత సినిమాల ముద్ర చెరిగిపోతుంది. రాహుల్ గత చిత్రాల మేకింగ్ స్టైల్ చూస్తే ఆ స్థాయిలో మ్యాజిక్ చేయగలడనే నమ్మకం కలుగుతుంది. కథలో చూపించిన అతీత శక్తులు నిజంగా ఉన్నాయా, లేక స్థానిక ప్రజలు తమ వీరుడి మీద ఉన్న అభిమానంతో అల్లుకున్న జానపద గాథనా అనేది సినిమా చూస్తే కానీ క్లారిటీ రాదు. అక్టోబర్ 16న థియేటర్లలోకి రాబోతున్న ఈ రణబాలి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.