నిర్మాతలు అదిగో ఇదిగో అనడమే తప్పించి ఫలానా డేటుకి రామాయణ పార్ట్ 1 రిలీజ్ అవుతుందని ఇప్పటికీ చెప్పకపోవడం మహా విచిత్రం. పోస్టర్లలో దీపావళి సందర్భంగా అనడమే తప్పించి తేదీని పేర్కొనడం లేదు. ఈ ధోరణి పట్ల బయ్యర్ వర్గాలు అసహనంగా ఉన్నాయి. ఎంత కంటెంట్ మీద నమ్మకం ఉన్నా ఇంత నిర్లక్ష్యం సరికాదని, అవతలి వాళ్ళను తక్కువ అంచనా వేస్తే తర్వాత దెబ్బ తినేది మీరేనని ఇన్ డైరెక్ట్ గా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అందులో నిజం లేకపోలేదు.
నాలుగు వేల కోట్లతో తీశామని నిర్మాత నమిత్ మల్హోత్రా కొన్ని నెలల క్రితం ఒక ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. నిజంగా అంత ఖర్చు పెట్టారాని టీజర్, ట్రైలర్ చూశాక డౌట్ వచ్చిన మాట వాస్తవం. అవన్నీ అసలు సినిమా తెర మీద చూశాక పటాపంచలవుతాయని టీమ్ చెబుతోంది. అయితే ఇంత పెద్ద గ్రాండియర్ ని ఎదురుగా పెట్టుకుని కూడా ఇతర నిర్మాతలు తమ రిలీజులు ప్లాన్ చేసుకోవడం చూస్తే ఇదేం స్ట్రాటజీ అనిపించక మానదు.
సూర్య సీన్, విజయ్ ఆంటోనీ నాన్న కుట్టితో పాటు కిరణ్ అబ్బవరం నిర్మించిన హారర్ మూవీ హతః అన్నీ నవంబర్ 6 విడుదలకు రెడీ అవుతున్నాయి. ఆపై వారం నవంబర్ 12 శర్వానంద్ భోగి ఇటీవలే అఫీషియల్ గా డేట్ లాక్ చేసుకుంది. ఇవి కాకుండా హాలీవుడ్ క్రేజీ మూవీ గాడ్జిల్లా మైనస్ జీరోని వివిధ దేశాలతో పాటు ఇండియాలోనూ పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఇంతమంది రామాయణని ఎందుకు తీవ్రమైన పోటీగా భావించడం లేదనేది అంతు చిక్కని ప్రశ్న.
ఇక్కడ నితేశ్ తివారి, నమిత్ మల్హోత్రాల మార్కెటింగ్ ప్లాన్ వైఫల్యాన్ని ప్రస్తావించుకోవాలి. అంత పెద్ద సినిమాకు పబ్లిసిటీ అవసరం ఎలా లేదని అనుకున్నారో అంతు చిక్కడం లేదు. రన్బీర్ కపూర్, సాయి పల్లవిలు ఈవెంట్లలో కనిపిస్తూనే ఉన్నారు కానీ రావణుడిగా నటించిన యష్ దర్శనం ఇంకా జరగలేదు. తనది పార్ట్ 2 లో మెయిన్ రోల్ కాబట్టి సన్నీ డియోల్ కూడా ప్రచారాలకు దూరంగా ఉంటారని టాక్. ఏమో రామాయణ వరస చూస్తుంటే వీళ్లేంటో వీళ్ళ విధానాలేంటో అనిపిస్తుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates