కూలీ దర్శకుడికి ఇలాంటి పరిస్థితి ఏంటో

ఒక్క ఫ్లాప్ కొందరు స్టార్ డైరెక్టర్ల ప్లానింగ్ ని ఎంత ప్రభావితం చేస్తుందో చెప్పడానికి లోకేష్ కనగరాజ్ ఉదాహరణ చాలు. ఖైదీ, విక్రమ్ లాంటి కల్ట్ మూవీస్ తో ప్రత్యేకమైన ఫాన్ బేస్ సృష్టించుకున్న ఈ యంగ్ డైరెక్టర్ కు రజనీకాంత్ కూలీ ఛాన్స్ వచ్చినప్పుడు అందరూ ఎగిరి గంతేశారు. కోలీవుడ్ కు తొలి వెయ్యి కోట్ల సినిమా అవుతుందని భావించారు. నాగార్జున, అమీర్ ఖాన్ క్యామియోలు చూసి మరింత అంచనాలు పెంచుకున్నారు. తీరా చూస్తే అంత పెద్ద మూవీ బాక్సాఫీస్ ఫెయిల్యూరయ్యింది.

తర్వాత లోకేష్ కు రజనీకాంత్ – కమల్ హాసన్ మల్టీస్టారర్ చేసే అదృష్టం దక్కింది. కథ సిద్ధం చేసుకున్నారు, బాషా, నాయకుడు వయసు అయిపోయాక కలిస్తే ఏం చేస్తారనే ఆలోచనతో కొత్త కోణంలో సబ్జెక్టు రాసుకున్నారు. కానీ ఫైనల్ నెరేషన్ తో మెప్పించలేకపోవడంతో ఆ అవకాశం కాస్తా నెల్సన్ దిలీప్ కుమార్ కు వెళ్ళిపోయింది. అయితేనేం లోకేష్ కనగరాజ్ కు అల్లు అర్జున్ పిలుపు వచ్చింది. వేరే స్టోరీ చెప్పాడు. నచ్చింది. బడ్జెట్ లెక్క చేయని మైత్రి మేకర్స్ స్టాంపుతో ప్రకటన వచ్చేసింది.

తీరా చూస్తే ఇప్పుడీ ప్రాజెక్టు ముందుకు వెళ్లడం కూడా అనుమానమే అని ఫిలిం నగర్ టాక్. సెకండాఫ్ విషయంలో బన్నీ అంత సంతృప్తిగా లేడని, రాకా విషయంలో ఈ క్వాలిటీ కోసం పోరాడబట్టే అట్లీ బెస్ట్ వెర్షన్ లాక్ చేశాడని, ఇప్పుడూ అదే పద్ధతి ఫాలో అవుతున్నాడని వినికిడి. లోకేష్ ఒకవేళ రెండోసారి కూడా మెప్పించలేకపోతే అల్లు అర్జున్ వేరే ఛాయస్ చూసే ఆలోచనలో ఉన్నారట. అదే జరిగితే లోకేష్ నెక్స్ట్ ఆప్షన్ గా మహేష్, ప్రభాస్ కోసం కథలు రెడీ చేశారట.

ప్రస్తుతానికి ఇదంతా ప్రచారం స్టేజిలోనే ఉంది కాబట్టి నిర్ధారణగా చెప్పలేం కానీ లోకేష్ కనగరాజ్ కు ఇలాంటి పరిస్థితి రావడం విచిత్రమే. అయినా కూలిలోనే చాలా పొరపాట్లు చేసిన లోకేష్ వాటిని మళ్ళీ రిపీట్ కాకూండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది. విలన్ పాత్రకు శవాలు కాల్చే విచిత్రమైన బిజినెస్ పెట్టి దెబ్బ కొట్టిన లోకేష్ మరీ కొత్తగా వింతగా కాకుండా కమర్షియల్ గా ప్యాన్ ఇండియా స్థాయిలో ఆలోచిస్తే చాలు. రోలెక్స్, ఖైదీ లాంటి అద్భుతమైన క్యారెక్టర్లు సృష్టించవచ్చు.