కమల్ కోసం రజినీ త్యాగం?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్ ఆరంభంలో కలిసి సినిమాలు చేశాక.. ఈ ఇద్దరూ వేర్వేరుగా దారుల్లో ప్రయాణం చేశారు. ఇద్దరూ వ్యక్తిగతంగా మంచి మిత్రులే అయినప్పటికీ.. అభిమానుల్లో మాత్రం బాగా గ్యాప్ వచ్చేసింది. కానీ ఇటీవల ఈ ఇద్దరు మిత్రులు మళ్లీ కలిసి సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలోనే కమల్ నిర్మాణంలో రజినీ ‘ధర్మన్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో ఇద్దరూ కలిసి స్క్రీన్ చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ ఇప్పుడింత క్లోజ్‌గా ప్రయాణం సాగిస్తున్న నేపథ్యంలో ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ జరిగినట్లు తెలుస్తోంది. కమల్ కోసం తన కొత్త చిత్రం రిలీజ్ డేట్‌ను రజినీ వాయిదా వేసుకున్నారట.

‘ధర్మన్’ చిత్రాన్ని 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలన్నది మొదట అనుకున్న ఆలోచన. ఈ దిశగా చకచకా చిత్రీకరణ కూడా సాగిస్తున్నారు. కొంచెం కష్టపడితే సంక్రాంతి రిలీజ్ డేట్‌ను అందుకునే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడు టీం ఈ విషయంలో వెనక్కి తగ్గిందట. కమల్ లాంగ్ డిలేయ్డ్ మూవీ ‘ఇండియన్-3’ని సంక్రాంతికి రిలీజ్ చేయడం కోసమే ఈ సర్దుబాటు అని తెలుస్తోంది.

ఇటీవలే ‘ఇండియన్-3’ పెండింగ్ షూట్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ‘ఇండియన్-2’ తీస్తున్నపుడే ఈ సినిమాలో చాలా వరకు పూర్తయింది. కానీ ఒక వార్ ఎపిసోడ్ మాత్రం పెండింగ్‌లో ఉండిపోయింది. ‘ఇండియన్-2’ డిజాస్టర్ కావడంతో ఆ మిగతా చిత్రీకరణ అలాగే ఆగిపోయింది. ఐతే ఇప్పుడు మళ్ళీ ఇండియన్ 3 పనులు ప్రారంభం అయ్యాయి.

వీలైనంత త్వరగా సినిమాను రెడీ చేసి సంక్రాంతికి రిలీజ్ చేద్దామని చూస్తున్నారట. ‘ఇండియన్’ సీక్వెల్ వల్ల లైకా వాళ్లు ఆల్రెడీ దారుణంగా దెబ్బ తిన్నారు. అందుకే ఈ సినిమాను సంక్రాంతి లాంటి క్రేజీ సీజన్లో రిలీజ్ చేసి కొంత మేర నష్టాలను భర్తీ చేసుకోవాలని అనుకుంటున్నారు. అందుకే ‘ధర్మన్’ చిత్రాన్ని వేసవికి వాయిదా వేసినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.