శ్రీవిష్ణు వాడ‌కం మామూలుగా లేదు

కామెడీ సినిమాల్లో స్పూఫులు, పేర‌డీలు అన్న‌వి కామ‌న్. మీమ్ టెంప్లేట్ల‌ను కూడా బాగా వాడితే మ‌రింత‌గా న‌వ్వులు పండుతాయి. అలా అని ఈ వాడకం శ్రుతి మించితే మ‌నోభావాలు దెబ్బ తిని లేని పోని ఇబ్బందులు కూడా రావ‌చ్చు. ఈ మ‌ధ్య కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమాలో సీనియ‌ర్ ఎన్టీఆర్ పాత సినిమాకు సంబంధించిన ఒక స‌న్నివేశాన్ని క‌మెడియ‌న స‌త్య అనుక‌రించ‌డం మీద ఎంత ర‌చ్చ జ‌రిగిందో తెలిసిందే. అయినా టాలీవుడ్లో ఈ ఒర‌వ‌డి ఏమీ మారిపోలేదు. తాజాగా కామ్రేడ్ క‌ళ్యాణ్‌లో వేరే సినిమాల మీద పంచులు చాలానే ప‌డ్డాయి.

స్పోర్టివ్‌గా తీసుకునేవాళ్ల‌కు ఇవి వినోదాన్ని పంచుతుండ‌గా.. కొంద‌రికేమో అవి హ‌ర్టింగ్‌గా అనిపిస్తున్నాయి. ఐతే ఇత‌ర హీరోల అభిమానులు ఫీల్ కాకుండా ముందు హీరో శ్రీ విష్ణు స్వ‌యంగా త‌న మీద తానే పంచ్ వేసుకున్నాడు. బూతుల్ని శ్రుతి క‌లిపేస్తూ మాట్లాడే త‌న డైలాగ్ డెలివ‌రీ మీద అత‌డి పంచ్‌ను ట్రైల‌ర్లోనే చూశాం. సినిమాలోనూ అది ఉంది.
ఆ సంగతి ప‌క్క‌న పెడితే.. సినిమాలో చాలామంది హీరోల సినిమాల మీద పంచులు ప‌డ్డాయి.

ట్రైల‌ర్లో చూపించిన కాకి సీన్ గురించి ప్రెస్ మీట్లో అడిగితే అది ప్యార‌డైజ్ కాకి కాద‌ని క్లారిటీ ఇచ్చారు ఈ చిత్ర ప్రెజెంట‌ర్ కోన వెంక‌ట్. కానీ సినిమాలో క్లియ‌ర్‌గా ప్యార‌డైజ్ కాకి అని ప్ర‌స్తావించి నాని అభిమానుల‌ను ఉడికించారు. మ‌రోవైపు ఫేక్ న‌క్స‌లైట్ అవ‌తారం ఎత్తిన హీరోను నువ్వు ఏ ద‌ళం అని న‌క్స‌ల్ నాయ‌కుడు అడిగితే.. ఆచార్య ద‌ళం అని, అదెక్క‌డుంద‌ని అడిగితే పాద‌ఘ‌ట్టానికి, ధ‌ర్మ‌స్థ‌లికి మ‌ధ్య అని బ‌దులిస్తాడు శ్రీవిష్ణు.

థియేట‌ర్లు న‌వ్వులు పండిన‌ప్ప‌టికీ.. ఆచార్య పెద్ద డిజాస్ట‌ర్ అయిన నేప‌థ్యంలో ఇది మెగా అభిమానుల‌కు కొంత హ‌ర్టింగ్‌గానే అనిపిస్తోంది. మ‌రోవైపు పుష్ప సినిమా రెఫ‌రెన్స్ కూడా ఉందీ సినిమాలో. ఒక చోట‌ అట‌వీశాఖా మంత్రి పేరును ముల్లేటి పుష్ప‌రాజ్ అని పేర్కొంటాడు శ్రీవిష్ణు. మ‌రో సీన్లో శ్రీవిష్ణు క‌ళ్ల‌తో హావ‌భావాలు ప‌లికిస్తా అంటూ ఇచ్చే ఎక్స్‌ప్రెష‌న్ ఒక హీరోను ఇమిటేట్ చేసిన‌ట్లుందంటూ ఒక ప్రచారం న‌డుస్తోంది సోష‌ల్ మీడియాలో. ఇంకా ప‌లు చిత్రాలు, సోష‌ల్ మీడియా మీమ్ టెంప్లేట్ల‌ను ఈ సినిమాలో బాగా వాడుకున్నారు. ఐతే శ్రీవిష్ణు మీద అంద‌రు హీరోల్లో ఉన్న పాజిటివిటీ వ‌ల్ల ఇవి మ‌రీ వివాదాస్ప‌దం ఏమీ కావ‌ని భావిస్తున్నారు.