విజయ్ చెప్పింది ప్రాక్టికల్‌గా సాధ్యమేనా

రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్ దేవరకొండ మీడియా ప్రతినిధుల దగ్గర అన్న మాట ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఒక్క రాజమౌళితో చేస్తే మటుకు దీన్ని పాటించలేనని, మిగిలిన వాటికి మాత్రం హైక్స్ లేకుండా సాధారణ ధరలకే అంటుబాటులో తెస్తానని చెప్పడం అభిమానులకే కాదు సగటు మూవీ లవర్స్ కి కూడా శుభవార్తే. అయితే ఇక్కడ కొన్ని ఆలోచించాల్సిన విషయాలున్నాయి.

నిర్మాణ వ్యయం అనేది పూర్తిగా దర్శక నిర్మాత చేతుల్లో ఉంటుంది. ఇది పెరగడం తగ్గడం వాళ్ళ ప్లానింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి అనుకున్న దానికన్నా రెట్టింపు అయిపోయి తలకు మించిన భారం మోసిన ప్రొడ్యూసర్లు ఎందరో. టాక్సిక్, రాజా సాబ్ లాంటివి ముందు రాసుకున్న బడ్జెట్లకు, ఫైనల్ గా జరిగిన ఖర్చులకు పొంతన లేకుండా ఖర్చు పెట్టినవి. డిజాస్టర్లు కావడం పక్కన పెడితే వాటి రికవరీ కోసం నిర్మాతలు టికెట్ రేట్ల పెంపుని తీసుకోవడం తప్ప ఆప్షన్ లేకపోయింది.

అసలే హైక్స్ జోలికి వెళ్లకుండా ఇరుముడి, లెనిన్, మా ఇంటి బంగారం లాంటివి అద్భుత ఫలితాలు అందుకున్నాయి. ప్యాన్ ఇండియా కాకపోయినా ఆ స్థాయిలో విజయాలు సాధించాయి. రణబాలి కూడా అంతకు మించి ఆడుతుందనే నమ్మకంతో మైత్రి సంస్థ పెంపుల జోలికి వెళ్లడం లేదు. అయితే ప్రతిసారి విజయ్ దేవరకొండ ఈ వెసులుబాటుని తెచ్చుకోగలడా అంటే వెంటనే ఔనని చెప్పలేం. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే రౌడీ జనార్ధన కూడా హై బడ్జెట్ మూవీనే. దీనికి నిర్మాత దిల్ రాజు.

ఒకవేళ దీనికీ కాస్ట్ పెరిగిపోయి క్వాలిటీ కోసం ఎక్కువ వ్యయం జరిగితే అప్పుడు పెంపుకు వెళ్లాల్సి ఉంటుంది. విజయ్ దేవరకొండ నిజంగా అలా జరగకుండా చూసుకోవాలంటే రెమ్యునరేషన్ కొంత తగ్గించుకునే నిర్ణయాలు తీసుకోవాల్సి రావొచ్చు. ఈ స్టేట్ మెంట్ మీద ఎంత మేరకు కట్టుబడి ఉంటాడనేది కాలమే నిర్ణయించాలి. డబ్బింగ్ సినిమా జైలర్ 2 హైక్స్ తెచ్చుకుని రణబాలి రెగ్యులర్ రేట్లకే అందుబాటులోకి రావడం బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పరిణామంగా మారింది.