బ్లాక్ బస్టర్ మనకెందుకు నచ్చడం లేదంటే

కన్నడలో గత నెల 25 ప్యారడైజ్ తో పాటుగా విడుదలైన ప్రేమద ఊరల్లీ భీభత్సమైన కలెక్షన్లతో కర్ణాటకలో అదరగొడుతోంది. రెండో వారంలో 344 శాతం పెరుగుదల చూపించడమంటే మాటలు కాదు. అయితే తెలుగు డబ్బింగ్ ప్రేమనే ఊరిలో మొన్న అక్టోబర్ 2 రిలీజయ్యింది. మన ఆడియన్స్ దీన్ని లైట్ తీసుకున్న వైనం ఆక్యుపెన్సీలో కనిపిస్తోంది. హైదరాబాద్ కొంత వరకు ఓకే కానీ మిగిలిన చోట నామమాత్రపు కలెక్షన్లు వస్తున్నాయి. అంత బ్లాక్ బస్టర్ మనకెందుకు నచ్చలేదనే పాయింట్ కొద్దాం.

ఓపెన్ గా చెప్పాలంటే ప్రేమనే ఊరిలో టీవీ సీరియల్ నెరేషన్ తరహాలో ఉంటుంది. ఒక రైతు తల్లి లేని కొడుకుని కంటికి రెప్పలా పెంచుతాడు. దగ్గరి బంధువైన అమ్మాయి కన్నా చదువుకున్న పిల్ల అయితే బాగుంటుందనే ఉద్దేశంతో పెద్ద క్వాలిఫికేషన్ ఉన్న కోడలిని తెచ్చుకుంటాడు. అయితే భార్య పూర్వ జీవితం గురించి పుకార్లు నమ్మిన హీరో ఆమెను అపార్థం చేసుకుంటాడు. దాని వల్ల పెద్దాయన అంతులేని దుఃఖంలో మునిగిపోతాడు. తర్వాత ఎలా ఒక్కటయ్యారు అనేది స్టోరీ.

ఇక్కడో ఫ్లాష్ బ్యాక్ కు వెళ్ళాలి. ఇరవై సంవత్సరాల క్రితం శాండల్ వుడ్ లో ముంగారు మలే అనే సూపర్ డూపర్ హిట్ సినిమా ఒకటి వచ్చింది. ఆ ఏడాది మొత్తంలో టాప్ గ్రాసర్ గా నిలిచింది. ఈ ఎమోషనల్ లవ్ స్టోరీని చూసి ముచ్చటపడిన నిర్మాత ఎంఎస్ రాజు స్వీయ దర్శకత్వంలో దాన్ని వాన పేరుతో రీమేక్ చేశారు. తీరా చూస్తే బొమ్మ అట్టర్ ఫ్లాప్ అయింది. మన ఆడియన్స్ పట్టించుకోలేదు. అంత సాగదీసిన ఎమోషన్స్ అంగీకరించలేదు. పాటలు మాత్రమే హిట్టయ్యాయి.

ఇప్పుడు ప్రేమనే ఊరిలో రీమేక్ కాకపోయినా డబ్బింగ్ జరిగి అదే రిజల్ట్ అందుకోవడం విచిత్రం. ఇదే కాదు అక్కడ ఇండస్ట్రీ రికార్డులు సృష్టించిన శివరాజ్ కుమార్ ఓం ఇక్కడ రాజశేఖర్ ఓంగా తీస్తే యావరేజ్ కూడా కాలేదు. ఇలా పలు సందర్భాల్లో జరిగింది. ప్రేమనే ఊరిలో వరసగా రెండు వారాల పాటు రోజుకు లక్షకు పైగా టికెట్లు అమ్మిన అరుదైన ఘనత సొంతం చేసుకుంది. టాలీవుడ్ ఆడియన్స్ భావోద్వేగాలను ఆదరిస్తారు కానీ డ్రామా మరీ ఎక్కువైతేనే నో అనేస్తారు.