అందరూ బాధితులే… ఇంతకీ విలన్లెవరు?

ఇప్పుడు టాలీవుడ్లో చాలామంది యంగ్ హీరోలది ఒకటే మాట. తమ సినిమాలను ఎవరో పనిగట్టుకుని టార్గెట్ చేస్తున్నారని. తమ చుట్టూ నెగెటివిటీని పెంచే ప్రయత్నం జరుగుతోందని. కొందరు ఈ విషయంలో ఓపెన్‌గా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం రెండేళ్ల ముందే ‘క’ సినిమా టైంలో తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కాడు. ‘క’ సినిమా విడుదలకు ముందు నాతో ఏంటి మీకు ప్రాబ్లం, నేను ఎదగకూడదా అంటూ.. తననెవరో తొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నట్లుగా మాట్లాడాడు.

ఇటీవల సందీప్ కిషన్ కూడా తన ‘సిగ్మా’ సినిమా మీద నెగెటివ్‌ క్యాంపైనింగ్ చేస్తున్నారంటూ ట్వీట్ వేశాడు. అంతకుముందు ఒక ఇంటర్వ్యూలో కూడా ముగ్గురు హీరోలు తామే సోషల్ మీడియాలో హైలైట్ అయ్యేలా.. మిగతా వాళ్లు కనిపించకుండా పీఆర్ మేనేజ్మెంట్ చేస్తున్నారని ఆరోపించాడు.

నేచురల్ స్టార్ నాని నేరుగా ఇలాంటి కామెంట్లు చేయలేదు కానీ.. తన సినిమా ‘ది ప్యారడైజ్’ మూవీ రిలీజైనపుడు పనిగట్టుకుని ఆ సినిమాకు వ్యతిరేకంగా హేట్ క్యాంపైనింగ్ చేశారంటూ తన ఫ్యాన్స్ ఆరోపణలు గుప్పించారు. నాని సైతం సోషల్ మీడియా నెగెటివిటీ గురించి పరోక్షంగా మాట్లాడాడు. ఇప్పుడేమో విజయ్ దేవరకొండ తన సినిమా ‘రణబాలి’కి వ్యతిరేకంగా పెయిడ్ క్యాంపైనింగ్ చేస్తున్నారనే అనుమానం వ్యక్తం చేశాడు.

ఐతే ఇలా వరుసగా ఒక్కో హీరో తమకు, తమ సినిమాలకు వ్యతిరేకంగా ఏదో జరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తుండగా.. ఇదంతా చేయించేది ఎవరు, దాని వల్ల ఎవరికి ప్రయోజనం అన్నదే అర్థం కావడం లేదు. నాని, విజయ్ మంచి మిత్రులే అయినా.. వాళ్ల అభిమానులు బద్ధ శత్రువులైపోయారు ఈ మధ్య. ఈ హేట్ క్యాంపైనింగ్ విషయంలో ఒకరి మీద ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.

కానీ నాని, విజయ్ డబ్బులు పెట్టుకుని అవతలి హీరో, తన సినిమా మీద హేట్ క్యాంపైనింగ్ చేస్తారా అన్నది ప్రశ్న. ‘రణబాలి’కి పోటీగా ఉన్నదేమో ‘జైలర్-2’. ఆ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న నాగవంశీకి విజయ్‌ క్లోజ్. గత ఏడాది వీరి కలయికలో ‘కింగ్డమ్’ సినిమా వచ్చింది. అలాంటపుడు ఆయన విజయ్ సినిమాను టార్గెట్ చేసే అవకాశం లేదు. మరి ‘రణబాలి’ నెగెటివ్ క్యాంపైనింగ్ వెనుక ఉన్నాడంటే నమ్మలేం. మరి నిజంగా ‘రణబాలి’ని టార్గెట్ చేస్తోంది ఎవరు? అనే ప్రశ్న తలెత్తుతోంది.

ఇలా మాట్లాడ్డం ద్వారా హీరోలు విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నారా.. తద్వారా సినిమాకు కలిసొస్తుందని భావిస్తున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలా కాని పక్షంలో ఇలా వరుసగా హీరోల సినిమాల మీద నెగెటివ్ క్యాంపైనింగ్ చేయించి ప్రయోజనం పొందుతోంది ఎవరన్నది సందేహం.