మంచి రైట‌ర్‌.. ఇంత కాలానికి పెద్ద ఛాన్స్

ల‌క్ష్మీ భూపాల‌.. తెలుగు సినిమా రంగంలో ఉన్న మంచి ర‌చ‌యిత‌ల్లో ఒక‌రు. కాక‌పోతే ఆయ‌న ప్ర‌తిభ‌కు త‌గ్గ పేరు రాలేదు. పెద్ద సినిమాలు, క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్టైన‌ర్ల‌కు ప‌ని చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల ఆయ‌న టాలెంట్ ఏంట‌న్న‌ది అంద‌రికీ తెలియ‌లేదు. మీడియాలో కూడా ఈ పేరు పెద్ద‌గా నాన‌లేదు. అలా మొద‌లైంది, కానీ చంద‌మామ‌, మ‌హాత్మ‌, క‌ళ్యాణ వైభోగ‌మే, నేనే రాజు నేనే మంత్రి, ఓ బేబీ.. ఈ సినిమాల వ‌రుస చూస్తే, అందులోని డైలాగులు గుర్తు తెచ్చుకుంటే ల‌క్ష్మీ భూపాల ఎంత మంచి ర‌చ‌యిత అనే విష‌యం అర్థ‌మ‌వుతుంది.

ఎక్కువ‌గా నందిని రెడ్డి సినిమాల‌తో పేరు సంపాదించిన ల‌క్ష్మీ భూపాల‌కు ఎట్ట‌కేల‌కు కెరీర్‌కు పెద్ద బూస్ట‌ప్ ఇచ్చే అవ‌కాశం అందింది. ఇప్ప‌టిదాకా ఏ పెద్ద‌ హీరోతో సినిమా చేయ‌ని ల‌క్ష్మీ భూపాల ఒకేసారి ఏకంగా మెగాస్టార్ సినిమాకు మాట‌లు రాసే అవ‌కాశం అందుకున్నారు.

చిరంజీవి హీరోగా బుధ‌వారం లూసిఫ‌ర్ రీమేక్ ప్రారంభోత్స‌వం జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి సంభాష‌ణ‌లు అందించ‌నున్న‌ది ల‌క్ష్మీ భూపాలనే. ఈ విష‌యాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్ర‌క‌టించింది. తెలుగు వాడే అయిన త‌మిళ ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా ఈ సినిమాకు ద‌ర్శ‌కత్వం వ‌హించ‌నున్న సంగ‌తి తెలిసిందే. లూసిఫ‌ర్‌ను ఉన్న‌దున్న‌ట్లు దించేయ‌కుండా కొన్ని మార్పులు చేర్పులు కూడా చేస్తున్నాడు మోహ‌న్‌ రాజా. స్క్రిప్టు చ‌ర్చ‌ల్లో భాగ‌స్వామి అయిన ల‌క్ష్మీ భూపాల సంభాష‌ణ‌లు కూడా అందిస్తున్నాడు.

కెరీర్లో తొలిసారి ఓ పెద్ద అవ‌కాశం, అది కూడా మెగాస్టార్‌తో కావ‌డంతో ల‌క్ష్మీభూపాల త‌న టాలెంట్ చూపిస్తే ఇన్నేళ్ల‌లో రానంత గుర్తింపు రావ‌డం, ఆయ‌న కెరీర్ మ‌రో స్థాయికి చేర‌డం ఖాయం. ఈ చిత్రానికి సీనియ‌ర్ ర‌చ‌యిత స‌త్యానంద్ సైతం ర‌చ‌నా స‌హ‌కారం అందిస్తుండ‌టం విశేషం. త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీత ద‌ర్శ‌కుడు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌తో క‌లిసి ఎన్వీ ప్ర‌సాద్ లూసిఫ‌ర్ రీమేక్‌ను నిర్మిస్తున్నారు.