సింగీతం శ్రీనివాసరావు గురించి చెప్పమంటే ఏం చెబుతాం.. రాసి తక్కువ.. వాసి ఎక్కువ.. అంతే! ఓ ప్రముఖ నిర్మాత చేసిన వ్యాఖ్యలు సింగీతం విషయంలో సదా స్మరణీయం అనడంలో ఎలాంటి సందేహం లేదు!.
సింగీతం శ్రీనివాసరావు.. తెలుగు వారికి బాగా సుపరిచితులైన దిగ్గజ దర్శకుడు. ఒక మూస విధానంలో కొట్టుకుపోతున్న సినిమా పరిశ్రమను తనదైన శైలిలో అద్భుత మార్గాన్ని పట్టించిన డైరెక్టర్‌గా రికార్డులు సృష్టించారు. ఊహాజనిత కథనాలను వాస్తవ రూపంలోకి తీసుకురావడంలోను, కన్నీటి నిజ గాధలను సెల్యులాయిడ్‌పై చిత్రీకరించడంలోనూ ఆయనకు ఆయనే సాటి!. ఆదిత్య 369 ఈ సినిమా వచ్చినప్పుడు అందరూ అదో చిత్రం అనుకున్నారు. నిజమేనా? అని భ్రమించారు. కాలగతిలో వెనక్కి వెళ్లే యంత్రాలు వస్తాయా? అని చర్చించుకున్నారు. ఆ సినిమా ద్వారా సింగీతం చేసిన ప్రయోగం.. అనేక భాషల్లోకి అనువాద రూపంలో మారి.. విశేష ప్రేక్షక ఆదరణను సొంతం చేసుకుంది.
మయూరి-ఈ సినిమా ఖర్చు తక్కువ!. కానీ రాబడి.. ప్రవాహంగా మారింది. తమిళనాడులోని ఓ యువతి గాధను వెండితెరపై సాక్షాత్క రింపచేయడమే కాదు.. ఆ యువతినే హీరోయిన్‌గా పెట్టి చేసిన ప్రయోగం.. సింగీతానికే చెల్లింది!. తొలి రోజు పెద్దగా కలెక్షన్లు రాలేదు. ఇక, ప్రయోగాలు ఆపేద్దాం.. అనుకున్నారట. కానీ.. మలి రోజు నుంచి మొదలైన కలెక్షన్ల ప్రవాహం.. సింగీతాన్ని ప్రయోగాలే ఊపిరిగా మార్చేలా చేసిన సినిమా మయూరి అంటారు.
ఇక, మరో అద్భుత ప్రయోగం పుష్పక విమానం. దీనిలో కమల్, విజయశాంతిలతో చేసిన సింగీతం ప్రాక్టికల్స్.. అందరినీ కట్టిపడేశాయి. ఆద్యంత మూకీగా సాగే ఈ సినిమా ఏం ఆడుతుందో.. అని పెదవి విరిచారు. కానీ, ఆ సినిమా ఇప్పటికీ ఓ రికార్డే అంటే ఆశ్చర్యం.. అతిశయోక్తి కాదు!. ఇక, అపూర్వ సహోదరులు సినిమా ఎలాంటి సినిమా ట్రిక్స్ లేని రోజుల్లో తీసిన ప్రయోగం. గ్రాఫిక్స్ లేని కాలంలో లెన్స్ ట్రిక్స్‌తో మరుగుజ్జు పాత్రను సృష్టించి సాంకేతిక అద్భుతాన్ని చూపించారు.
ఇక, సింగీతం అంటే.. అభిరుచి.. సింగీతం అంటే ఒక ప్రయోగం. ఎన్ని సినిమాలు చేశామన్నదికాదు.. ఎన్ని సజీవ చిత్రాలను మలిచామ న్నదే ఆయన టార్గెట్!. ఎంత ఖర్చు పెట్టామన్నది.. పెట్టించామన్నది కాదు.. ఎంతగా ప్రేక్షకుల మనసులు గెలిచామన్నది ప్రధానం. అందుకే ఆయన రాసి(సంఖ్య) చూసుకోలేదు. వాసి(కథనంలో దమ్ము)ని నమ్ముకున్నారు. రాసి తక్కువైనా.. వాసిని బలంగా వండివార్చారు. అందుకే సుదీర్ఘ సినీ ప్రస్థానంలో పేరుండి పోయే చిత్రాలనే సింగీతం చేయగలిగారు తప్ప.. నెంబరు కోసం పాకులాడలేదు. మొత్తం సినీ ప్రస్థానంలో 61 సినిమాలను మాత్రమే ఆయన తీశారు. ప్రతి సినిమాలోనూ మనసు పెట్టారనడంలోనూ అతిశయోక్తి లేదు.
నెల్లూరాయనే..
సింగీతం శ్రీనివాసరావు.. 1931, సెప్టెంబర్ 21న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జన్మించారు. ప్రసిద్ధ దర్శకులు కె.వి. రెడ్డి వద్ద ‘మాయాబజార్` చిత్రానికి సహాయ దర్శకుడిగా చేరి.. చిరకాలం గుర్తుండిపోయే అలాంటి సినిమాలకే ప్రాణం పోశారు. సింగీతం మృతి భౌతికమే అయినా.. చిత్ర సీమలో ప్రయోగాలకు, అద్భుతాల సృష్టికి మాత్రం.. ఆయన చిరాయువు పోశారనడంలో సందేహం లేదు. 94 ఏళ్ల వయసులో సింగీతం చెన్నైలో కన్నుమూసిన నేపథ్యంలో నివాళిగా ఈ జ్ఞాపకాలు!.
Gulte Telugu Telugu Political and Movie News Updates