ఫౌజీ పరుగు ఎక్కడి దాకా వచ్చింది

డిసెంబర్ 3 నుంచి తప్పుకున్నాక ఫౌజీ ఎప్పుడు విడుదలవుతుందనే దాని మీద సందిగ్దత వీడలేదు. టీమ్ అధికారికంగా ప్రకటించనప్పటికీ ఇటీవలే ప్యారడైజ్ ఫంక్షన్ లో మైత్రి రవిశంకర్ చెప్పేయడంతో క్లారిటీ వచ్చేసింది. అయితే ప్రభాస్ అభిమానులను బాగా తొలుస్తున్న ప్రశ్న ఒకటుంది. మార్చిలో స్పిరిట్ వస్తుందా లేక దాని స్థానంలో ఫౌజీని ప్లాన్ చేస్తున్నారాని. సందీప్ రెడ్డి వంగా అయితే ప్రస్తుతానికి వెనక్కు తగ్గే ఆలోచనలో లేరని అంతర్గత వర్గాల సమాచారం.

అది నిజమైన పక్షంలో ఫౌజీ ఏ దసరాకో దీపావళికో వెళ్లాల్సి ఉంటుంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ అక్టోబర్ 20 దాకా ఉంటుంది. అటుపై ఇంకో పది రోజుల షూట్ తో పాటు ఒక పాట చిత్రీకరణ హైదరాబాద్ బయట చేయబోతున్నారు. లొకేషన్లు ఇంకా ఫైనల్ కాలేదు. ఇదంతా అయ్యేలోపు ఇంకో రెండు నెలలు గడిచిపోతాయి. అప్పటిదాకా మూమెంట్ మైంటైన్ చేసేందుకు ఒక టీజర్ లాంటిది అక్టోబర్ లో రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.

ప్రస్తుతం ఫౌజీ ముందు ఉన్న బెటర్ ఆప్షన్ జనవరి మూడో వారం. రిపబ్లిక్ డేని టార్గెట్ చేసుకుంటే ఫిబ్రవరి నెల వరకు బాక్సాఫీస్ ని లాగేయొచ్చు. సంక్రాంతి హడావిడి కూడా తగ్గిపోయి ఉంటుంది కాబట్టి పోటీ పరంగా టెన్షన్ ఉండదు. ఇది ముందే గుర్తించిన రన్బీర్ కపూర్ లవ్ అండ్ వార్ బృందం తమ విడుదల తేదీని జనవరి 21 లాక్ చేసుకుని అఫీషియల్ పోస్టర్ వేసేసింది. అంటే ఒకవేళ ఫౌజీ కనక క్లాష్ అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో థియేటర్ల సమస్య రావొచ్చన్న మాట.

ఇది మిస్ అయితే స్పిరిట్ ని తప్పించి ఆ డేట్ లో ఫౌజీ రావాల్సి ఉంటుంది. ఇదంతా ఇప్పటికైతే క్లారిటీ లేకుండా ఉంది. ఇమాన్వి హీరోయిన్ గా నటించిన ఫౌజీలో పలువురు బాలీవుడ్ నటులు కీలక పాత్రలు పోషించారు. స్వాతంత్రం రాక ముందు ఒక బ్రాహ్మణ సైనికుడు చేసిన యుద్ధం, అతని ప్రేమకథ ఆధారంగా దర్శకుడు హను రాఘవపూడి ఫౌజీని తీర్చిదిద్దారు. విశాల్ చంద్రశేఖర్ కంపోజ్ చేసిన పాట ఏదైనా ఒకటి వదిలితే డార్లింగ్ ఫ్యాన్స్ కొంచెం ఊరట పొందుతారేమో.