అయిదేళ్ల ముందు టాలీవుడ్ యువ కథానాయకుడు, మెగా ఫ్యామిలీ కుర్రాడు సాయిధరమ్ తేజ్ ఎంత పెద్ద ప్రమాదానికి గురయ్యాడో గుర్తుండే ఉంటుంది. బైక్ నడుపుతూ అదుపు తప్పడంతో అతను తీవ్ర గాయాలపాలై ఆసుపత్రికి చేరాడు. కొన్ని వారాల పాట హాస్పిటల్లోనే ఉన్న తేజు.. తర్వాత మరి కొన్ని నెలలు ఇంటికే పరిమితం అయ్యాడు. ప్రాణాపాయం తప్పించుకున్నాడు కానీ.. ప్రమాదం తర్వాత తన రూపురేఖలు మారిపోయాయి.
చాన్నాళ్ల పాటు శారీరక, మానసిక సమస్యలను ఎదుర్కొన్నాడు. ఇప్పటికీ అతను మునుపటంత ఉత్తమ స్థితికి రాలేదు. ఐతే అంత పెద్ద ప్రమాదం తర్వాత కోలుకుని మళ్లీ సినిమాలు చేసే స్థాయిలో ఉండడమే గొప్ప. అందుకే ఆ ప్రమాదం గురించి తరచుగా ప్రస్తావిస్తూ దాన్ని తన పునర్జన్మగా చెబుతుంటాడు తేజు. రోడ్డు ప్రమాదాల విషయంలో జనాలను హెచ్చరిస్తూ కూడా ఉంటాడు.
తాజాగా మరోసారి ఆ ప్రమాదాన్ని గుర్తు చేసుకుని.. తాను పునర్జన్మ ఎత్తడానికి కారణమైన అందరికీ కృతజ్ఞతలు చెప్పాడు. ఐతే ఆ ప్రమాద సమయంలో తేజును కాపాడి సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లిన అబ్దుల్ సయ్యద్ ఫర్హాన్‌ను తర్వాత ఈ మెగా హీరో పట్టించుకోలేదంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు. కొందరు బూతులు తిడుతూ పోస్టులు పెట్టారు. ఈ పోస్టులపై తేజు వెంటనే స్పందించాడు. అబ్దుల్, అతడి కుటుంబ సభ్యులను కలవడం.. అతణ్ని సత్కరించడం.. ఆర్థిక సాయం అందించడడం గురించి ప్రస్తావించాడు.
సంబంధిత ఫొటోలు, వీడియోలు కూడా షేర్ చేశాడు. ప్రస్తుతం అబ్దుల్ ఉద్యోగం చేసుకుంటూ తన జీవితం తాను గడుపుతున్నాడని,అబ్దుల్ తన స్వేచ్ఛకు భంగం వాటిల్లకుండా చూడాలన్న ఉద్దేశంతో తనకు సంబంధించిన సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవట్లేదని తేజు చెప్పాడు. ఈ సంగతి పంచుకోవడం ద్వారా తన విమర్శకులకు చెంపపెట్టు లాంటి సమాధానం చెప్పిన తేజు.. తనను బూతులు తిట్టి, అభ్యంతరకర కామెంట్లు చేసిన వాళ్ల పట్ల కూడా సానుకూలంగానే మాట్లాడాడు. తనను దీవించిన వాళ్లందరికీ కృతజ్ఞతలు చెబుతున్నానని.. వాళ్లంతా కూడా బాగుండాలని తేజు కామెంట్ చేశాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates