రామాయ‌ణం సినిమాను బ్యాన్ చేయండి… వీహెచ్‌పీ డిమాండ్‌

గ‌త రెండు వారాలుగా వ‌ర‌ల్డ్ వైడ్ బాక్సాఫీస్‌పై దండ‌యాత్ర చేస్తోంది రామాయ‌ణం సినిమా. ద‌క్షిణాదిన రెండో వీకెండ్ వ‌ర‌కు మంచి వ‌సూళ్లు సాధించి, ఆ త‌ర్వాత చ‌ల్ల‌బ‌డింది కానీ.. ఉత్త‌రాదిన‌, అలాగే విదేశాల్లో ఇప్ప‌టికీ మంచి క‌లెక్ష‌న్లు రాబ‌డుతోందీ చిత్రం. ఇలా మంచి ర‌న్‌తో న‌డుస్తున్న సినిమాకు ఇప్పుడు పెద్ద షాక్ త‌గిలింది. విశ్వ హిందూ ప‌రిష‌త్ (వీహెచ్‌పీ) ఈ సినిమాను తీవ్రంగా వ్య‌తిరేకించడం సంచ‌ల‌నం రేపుతోంది. థియేట‌ర్ల‌లో రామాయ‌ణం సినిమా ప్ర‌ద‌ర్శ‌న ఆపేయాల‌ని.. ఈ సినిమాకు సెన్సార్ స‌ర్టిఫికెట్ కూడా ర‌ద్దు చేయాల‌ని వీహెచ్‌పీ డిమాండ్ చేస్తోంది.

హిందూ సంస్కృతి కోసం పాటుప‌డే వీహెచ్‌పీ.. రామాయ‌ణం లాంటి గొప్ప హిందూ పురాణ గాథ ఆధారంగా తీసిన సినిమాకు వ్య‌తిరేకంగా వ్యాఖ్య‌లు చేయ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మే. ఐతే వాల్మీకి ర‌చించిన అస‌లు రామాయ‌ణాన్ని వ‌క్రీక‌రించి ఈ సినిమా తీశార‌న్న‌ది ఆ సంస్థ అభ్యంత‌రం. వాల్మీకి రామాయ‌ణానికి భిన్నంగా సినిమాలో ఏడు ఎపిసోడ్లు ఉన్న‌ట్లుగా వీహెచ్‌పీ ఆరోపిస్తోంది.

ముఖ్యంగా సినిమాలో రాముడి పాత్ర‌ను త‌క్కువ చేసి చూపించార‌ని.. అస‌లు క‌థ‌లో లేని విష‌యాల‌ను ఈ పాత్ర‌కు ఆపాదించార‌ని.. రావ‌ణుడి పాత్ర‌ను ఉన్న దాని కంటే గొప్ప‌గా ప్రెజెంట్ చేశార‌ని, రావ‌ణుడిని ఎలివేట్ చేయ‌డానికే ఈ సినిమా తీసిన‌ట్లు ఉంద‌ని.. ఇలా వీహెచ్‌పీ అనేక అభ్యంత‌రాలు లేవ‌నెత్తింది. 

వెంట‌నే సెన్సార్ స‌ర్టిఫికెట్ ర‌ద్దు చేసి రామాయ‌ణం ప్ర‌ద‌ర్శ‌న నిలిపివేయాల‌ని వీహెచ్‌పీ డిమండ్ చేస్తున్న నేప‌థ్యంలో ఏం జ‌రుగుతుందో చూడాలి. వీహెచ్‌పీ లాంటి సంస్థ నుంచి ఇలాంటి డిమాండ్ రావ‌డం రామాయ‌ణం మేక‌ర్స్‌కు పెద్ద షాక్ అన‌డంలో సందేహం లేదు. సీతారాములుగా సాయిప‌ల్ల‌వి, ర‌ణ‌బీర్ క‌పూర్‌, రావ‌ణుడిగా య‌శ్ న‌టించిన రామాయ‌ణం చిత్రాన్ని నితీశ్ తివారి రూపొందించాడు. న‌మిత్ మ‌ల్హోత్రా నిర్మించిన ఈ మూవీ ఇప్ప‌టిదాకా వ‌ర‌ల్డ్ వైడ్ రూ.1500 కోట్ల‌కు పైగా గ్రాస్ క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది.