సూపర్ స్టార్ కోసం ‘సార్’ త్యాగం

బాక్సాఫీస్ వద్ద పోటీకి సంబంధించి రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దసరా పండగ టార్గెట్ గా ఈసారి క్రేజీ సినిమాలు రంగంలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 15 రజనీకాంత్ జైలర్ 2, మరుసటి రోజు విజయ్ దేవరకొండ రణబాలి రంగంలో ఉన్నాయి. వీటితో పాటు ధనుష్ ఓమ్ కూడా రేసులో ఉంది. అయితే సూపర్ స్టార్ కు దారి ఇస్తూ ఆయనకు కాంపిటీషన్ ఇవ్వడం భావ్యం కాదని భావించిన సూపర్ స్టార్ మాజీ అల్లుడు అలియాస్ టాలీవుడ్ సార్ ధనుష్ తన ఓమ్ వాయిదా వేశాడు.

దీపావళికి కూడా రావడం లేదని అప్పుడు సూర్య సీన్ ఉంది కాబట్టి, ముందే ప్రకటించిన వాళ్లకు గౌరవం ఇస్తూ దాని కూడా ఎంచుకోవడం లేదని తేల్చి చెప్పాడు. అంతా బాగానే ఉంది కానీ చెన్నై టాక్ మరోలా ఉంది. ఇంకా ఓమ్ షూటింగ్ అయిపోలేదట. కొంచెం ప్యాచ్ వర్క్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉండటం వల్ల వాయిదా వేశారని, అయినా సోలోగా రావాల్సిన ఇలాంటి సినిమా పోటీలో రెవిన్యూ పంచుకోవడం అంత భావ్యం కాదని పని చేసిన వాళ్ళు చెబుతున్న మాట.

ఓమ్ ఏదో రెగ్యులర్ గా వచ్చే ధనుష్ టైపు మూవీ కాదు. ఇంటెన్స్ డ్రామాగా అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి తెరకెక్కించారు. మమ్ముట్టి ఒక ప్రధాన పాత్ర పోషించగా శ్రీలీల, సాయిపల్లవి హీరోయిన్లుగా నటించారు. సౌత్ సెన్సేషన్ సాయి అభ్యంక్కర్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇది ఒక భాగం కాదు. సీక్వెల్ కూడా సమాంతరంగా షూట్ చేస్తున్నారు. దురంధర్ తరహాలో తక్కువ గ్యాప్ లో ప్యాన్ ఇండియా భాషల్లో రెండు పార్ట్స్ రిలీజయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

మొత్తానికి టాలీవుడ్ లోనే కాదు అటు కోలీవుడ్ లో కూడా ఇలాంటి క్లాషులు జరుగుతున్నాయని అర్థమైపోయిందిగా. ధనుష్ విషయానికి వస్తే గత కొంత కాలంగా సరైన సక్సెస్ లేక బాగా ఇబ్బంది పడుతున్నాడు. రాయన్ కు నేషనల్ అవార్డు వచ్చినా సరే ఏమంత ఆనందంగా కనిపించడం లేదు. కుబేర మన దగ్గర హిట్టయ్యింది కానీ తమిళంలో పోయింది. ఇడ్లి కడాయి తమిళంలో కొంత ఊరట కలిగించింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న కర చాలా తీవ్రంగా నిరాశ పరిచింది.